May 07,2023 20:50

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌. గేయానంద్‌

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌ : పిల్లలకు చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ అన్నారు. అనంత చిల్డ్రన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో గణేనాయక్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన సమ్మర్‌ క్యాంప్‌ను ఆదివారం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌, యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు రమణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందరాజులు, ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి తదితరులతో కలిసి సమ్మర్‌ క్యాంప్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా గేయానంద్‌ మాట్లాడుతూ అనంత చిల్డ్రన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో పిల్లల కోసం సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహించడం అభినందనీయమన్నారు. పిల్లలకు చదువుతో పాటు సమాజం పట్ల, చుట్టుపక్కల వారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ వేసవిలో ఇలాంటి క్యాంపు ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అన్ని రంగాలలో పోటీతత్వం ఉన్నట్లే చదువులో కూడా వచ్చిందన్నారు. అందుకోసం పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి మార్కులతో పాస్‌ అవ్వాలని నిరంతరం పిల్లలపై ఎక్కువ ఒత్తిడి తీసుకువస్తున్నారన్నారు. దీని వల్ల చదువు తప్ప వేరే ఆలోచన పిల్లలకు రావడం లేదన్నారు. దీని వల్ల పిల్లలలో నైపుణ్యత, సృజనాత్మకత లేకుండా పోతుందన్నారు. ఈ క్యాంపులో పిల్లలకు ఉపయోగపడేలా 20 రకాల ఈవెంట్స్‌ నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ క్యాంపు నిర్వహిస్తున్న క్లబ్స్‌ మెంబర్స్‌ను అభినందించారు. అనంత చిల్డ్రన్స్‌ క్లబ్‌ కన్వీనర్‌ నరసింహారెడ్డి, కో కన్వీనర్‌ కృష్ణవేణి మాట్లాడుతూ ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని పిల్లలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందుకు తల్లిదండ్రులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాన్స్‌మాస్టర్‌ కుళ్లాయి స్వామి, విజ్ఞానకేంద్రం కన్వీనర్‌ శ్రీనివాసరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి రాజేశ్వరి, ఆఫీస్‌ కార్యదర్శి సురేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు విజరు, ఖజీబి, గౌతమి, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.