ప్రజాశక్తి-ఆదోనిరూరల్
ఇంటర్మీడియట్ తరగతులు మొదలై నెలరోజులైంది. నేటికీ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందలేదు. బోధించేందుకు సరిపడ అధ్యాపకులు లేరు. విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. అటు ప్రయివేటు కళాశాలల్లో విద్యాబోధన వేగం పుంజుకోగా ప్రభుత్వ ఇంటర్ విద్యార్థులు మాత్రం దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ జూనియర్, మోడల్, కెజిబివి, గురుకుల జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందడం లేదు.
ఇంటర్మీడియట్ పాఠ్య పుస్తకాలు బయటకొనండి
పాఠ్యపుస్తకాలు బయట కొనుగోలు చేసుకోవాలని చెప్పడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విద్యా సంవత్సరం జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభమయ్యాయి. పాఠ్యపుస్తకాలు సరఫరా చేయలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. మార్కెట్‌లో కొత్త పుస్తకాలు కొనాలంటే రూ.1500 నుంచి రూ.3 వేల దాకా ఖర్చు అవుతుందని విద్యార్థులు వాపోతున్నారు.
పేద విద్యార్థులకు ఆర్థిక భారం
జిల్లాలో 23 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 8 వేల మందికి మించి విద్యార్థులు లేరు. అందులో అధ్యాపకుల కొరత కూడా ఉంది. ఇందులోనూ గ్రామీణ పేద బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులే అధికంగా ఉంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులకు పిల్లల చదువు భారంగా మారింది. కొందరు విద్యార్థులు పట్టణాలకు వచ్చి హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారు. మరికొంతమంది ఆటోల్లో, బస్సుల్లో వచ్చి చదువుకుంటున్నారు. ఈ ఖర్చు భరించడమే తల్లిదండ్రులకు భారం కాగా, పుస్తకాలు కూడా కొనాలంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు పుస్తకాల భారం...
మరోవైపు గ్రూపులపై పెరిగిన ఫీజులు
ప్రథమ సంవత్సరం ఎంపిసి, బైపిసి విద్యార్థులకు అన్ని రకాల ఫీజులతో కలిపి రూ.2,210, ఆర్ట్స్ గ్రూపులు (హెచ్‌ఇసి, సిఇసి) రూ.1,920, ఒకేషనల్ సాంకేతిక విద్యా కోర్సులకు రూ.2,434 వసూలు చేస్తున్నారు. అడ్మిషన్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు, దరఖాస్తు ఫీజు మరో రూ.1,500 అవుతుంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు స్పెషల్ ఫీజు మాత్రమే చెల్లించాలి. సైన్స్ గ్రూపు విద్యార్థులు రూ.1,385, ఆర్ట్స్ గ్రూపు విద్యార్థులు రూ.942 చెల్లించాల్సి ఉంటుంది.
మధ్యాహ్న భోజనం నిలిపివేత
గతంలో కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. కళాశాలలో గ్రామీణ ప్రాంత విద్యార్థులే అధికంగా ఉండడం, ఉదయమే వారి గ్రామాల నుంచి కళాశాలలకు వస్తుండడంతో వారికి మధ్యాహ్న భోజనం అందించాలని 2018లో నాటి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసింది. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం కూడా అందడం లేదని విద్యార్థులు తెలిపారు. ఇక బీసీ హాస్టల్‌లో ఉండే విద్యార్థులు రావడం, పోవడం చాలా దూరం. మధ్యాహ్నానికి క్యారియర్ కట్టిస్తున్నారని విద్యార్థులు తెలిపారు.
చదువుకోవడం కష్టంగా ఉంది
- రాజు, ఇంటర్మీడియట్ విద్యార్థి, ఆదోని
ఇంటర్మీడియట్ పుస్తకాలు లేక చదువుకోవడం కష్టంగా ఉంది. పుస్తకాలు కొనుగోలు చేయడం మా తమ తల్లిదండ్రులకు ఆర్థిక భారం. భరించలేకపోతున్నాం. పాత పుస్తకాల విషయానికి వస్తే, దొరకడం కష్టంగా ఉంది. అందులోనూ సైన్స్ గ్రూపు విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పుస్తకాలందించాలి
- శ్రీనివాసులు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు
నెల క్రితమే కళాశాలను ప్రారంభించినా, ఇప్పటివరకు పుస్తకాలు అందకపోవడంతో ఇంటర్మీడియట్ విద్యార్థులకు తప్పడం లేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు పుస్తకాలు అందించాలి. లేకపోతే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలకు సిద్ధమవుతాం.
కళాశాలలో కూర్చున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు










