- కలెక్టరేట్ ఎదుట సిఐటియు మానవహారం
ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్ : క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశంలో నిరంకుశ పాలన కొనసాగిస్తున్న నరేంద్ర మోడీని వచ్చే ఎన్నికల్లో గద్దె దింపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి అంజిబాబు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ''క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోమోడీని గద్దె దింపండి. దేశాన్ని కాపాడండి'' అనే నినాదంతో సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఓల్డ్ సిటీ కార్యదర్శి విజరు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిఎస్ రాధాకృష్ణ ఎండి అంజిబాబు పాల్గొని మాట్లాడుతూ.. మోడీ దేశ సంపద అంత కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పుతున్నాడన్నారు. ధనవంతులు మరింత ధనవంతులు గాను పేదవారు మరింత పేదవారుగాను అవుతున్నారన్నారు. మోడీ అధికారంలోకి రాకముందు ఆదాని ఆదాయం 700 కోట్లు మాత్రమేనని ప్రస్తుతం లక్షల కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చుకున్నారన్నారు. కిడ్ ప్రో విధానాన్ని అనుసరిస్తున్నారని అన్నారు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు సహకరిస్తే కార్పొరేట్ సంస్థలు బిజెపి అధికారంలోకి రావడానికి సహకరిస్తున్నాయన్నారు. మన రాష్ట్రంలో సముద్ర తీరం 900 కిలోమీటర్లు ఉండగా అధాని 550 కిలోమీటర్లకు పైగా తన గుప్పెట్లో పెట్టుకున్నారన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల నన్నింటిని కారు చౌకగా అమ్మేస్తున్నాడని విమర్శించారు. పోర్టులు విమానాశ్రయాలు రైల్వేలు రోడ్లు ఏవి మిగల్చకుండా అన్ని ప్రైవేట్ సంస్థలకు కారు చౌకగా అమ్ముతున్నాడని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అమ్మడమే పనిగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను అతి చౌకగా విదేశీ సంస్థకు అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. మోడీ విధానాల వల్ల దేశం దివాలా తీస్తుందని తెలిపారు. అంతేకాకుండా కార్మికులకు నష్టదాయకమైన అనేక విధానాల అనుసరిస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్రానికి పూర్వం ఉన్న లేబర్ చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి కార్మికుల మెడ పైన కత్తిలాగా పెట్టారన్నారు. అందుకనే మోడీని సాగనంపండి దేశాన్ని కాపాడండి అనే నినాదంతో కేంద్ర కార్మిక సంఘాలు క్విట్ ఇండియా ఉద్యమ రోజైన ఆగస్టు 9న మహా పడావో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి రామాంజనేయులు, ఎం గోపాల్, సిఐటియు న్యూ సిటీ కమిటీ కార్యదర్శి సిహెచ్ సాయి బాబా, జిల్లా ఉపాధ్యక్షులు ప్రభాకర్, నగర నాయకులు రాముడు, రాజశేఖర్ సుధాకరప్ప, నరసింహులు, అబ్దుల్ దేశారు, బి రాధాకృష్ణ, మహమూద్ రఫీ, వలి, కృష్ణ, సోలోమన్ రాజు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.










