ప్రజాశక్తి-ఘంటసాల : ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళం గ్రామంలో ముదిరాజు ఫీల్డ్ లేబర్ కో ఆపరేటివ్ సొసైటీ భూముల్లో అక్రమంగా సాగిన మట్టి తవ్వకాలను మాజీ ఉపసభవతి మండల బుద్ధ ప్రసాద్ శనివారం టిడిపి శ్రేణులు పార్టీ కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల జీవనాధారమైన పంట భూములు తవ్వేయటం వైసీపీ ప్రభుత్వ దౌష్ట్యాలకు, అరాచకాలకు, అన్యాయాలకు పరాకాష్ట అని అన్నారు. వైసీపీ పాలనలో సహజ వనరులు కొల్లగొట్టి భారీ దోపిడీ చేస్తున్నారని శ్రీకాకుళంలో 110 ఎకరాల ముదిరాజు ఫీల్డ్ లేబర్ కో ఆపరేటివ్ సొసైటీ భూముల్లో అక్రమంగా సాగిన మట్టి తవ్వకాలను చేయడంతో దశాబ్దాలుగా ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్న నిరుపేద బీసీల జీవనాధారమైన సాగు భూములు అధికార బలంతో త్రవ్వేసి సొమ్ము చేసుకున్న వైసీపీ నాయకులు నిరుపేద బీసీల భవిష్యత్తును కాలరాశారన్నారు. నిరుపేద ముదిరాజు రైతులు వైసీపీ నాయకుల దోపిడీని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవటం వెనుక ఎంతటి బలమైన రాజకీయ శక్తులు పని చేస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఈ అక్రమ తవ్వకాలకు బాద్యులపై చర్యలు తీసుకోవాలని బుద్ధప్రసాద్ డిమాండ్ చేశారు.










