- 15లోగా తెలంగాణకు కాపీ ఇవ్వండి
- కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ పై రాష్ట్ర ప్రభుత్వానికి బ్రిజేష్ ట్రిబ్యునల్ ఆదేశం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై నవంబర్ 22లోగా అభిప్రాయం చెప్పాలని, నవంబర్ 15లోగా తెలంగాణాకు కాపీ అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ఆదేశించింది. ఏపి అభిప్రాయాలపై స్టేట్‌మెంట్‌ను ఫైల్ చేయడానికి తెలంగాణకు అనుమతించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదంపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ (చైర్మన్), జస్టిస్ రామ్ మోహన్ రెడ్డి, జస్టిస్ ఎస్ తలపాత్ర(సభ్యులు)లతో కూడిన కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ బుధవారం విచారణ ప్రారంభించింది. 2023 అక్టోబర్ 6న కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ చేసిన ప్రొసీడింగ్‌లను 2023 అక్టోబర్ 18 నుండి 20కి రెండు వారాల పాటు వాయిదా వేయడానికి ఐఏ దాఖలు చేసింది. కానీ ట్రిబ్యునల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందని, అందుకు అవకాశం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్ ను కోరింది. అయితే, ఏపీ అభ్యర్ధనను తెలంగాణ ప్రభుత్వం తోసిపుచ్చింది. నీటి పంపకాలపై వెంటనే విచారణ చేపట్టాలని ట్రిబ్యునల్ ను తెలంగాణ కోరింది. అయితే ఏపి ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు విచారణను వాయిదా వేసింది.
రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు సంబంధించిన విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని అక్టోబర్ 6న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కృష్ణా నదీ జలాల పంపకాలపై విచారణ అధికారాలను కేంద్రం నోటిఫై చేసింది. ఆంధ్రప్రదేశ్ తరపు సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా వాదనలు వినిపిస్తూ ''గెజిట్ నోటిఫికేషన్ ప్రస్తుత రిఫరెన్స్ పరిధిని విస్తరింపజేసే ప్రస్తుత టీఓఆర్‌లను సవరించింది. ఇంకా, గోదావరి నీటి మళ్లింపు కొత్త టిఓఆర్‌లో చేర్చారు. దీన్ని గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ చేస్తుంది. .కృష్ణా ట్రిబ్యునల్ కాదు. రెండో అపెక్స్ కౌన్సిల్ మినిట్స్‌పై ఏపి ఆధారపడి ఉంది'' అని పేర్కొన్నారు. కొత్త గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం తీర్పును కొనసాగించవద్దని అభ్యర్థించారు. దీనికి సమాధానంగా తెలంగాణ తరపు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ సెక్షన్-89 ప్రొసీడింగ్స్ ప్రకారం షెడ్యూల్ చేయబడిన తుది వాదనలను కొనసాగించడం సరికాదని వాదించారు. తాము చాలా కాలం పాటు వేచి ఉన్నామని, చాలా కష్టంతో తాము ఈ కొత్త గెజిట్ ను పొందగలిగామని తెలిపారు. 811 టీఎంసీల పంపిణీలో జాప్యం, అడాక్ షేరింగ్ ఏర్పాట్లను కొనసాగించాలనే ఉద్దేశ్యంతో, ట్రిబ్యునల్‌కు సూచించిన గోదావరి టీఓఆర్‌పై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోందని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న ట్రిబ్యునల్ నవంబర్ 22, 23ల్లో విచారణకు వాయిదా వేసింది.










