Sep 25,2023 13:03

పాట్నా :   బీహార్‌లో దారుణం జరిగింది. వడ్డీవ్యాపారి, అతని సహచరులు దళిత మహిళపై పైశాచికంగా ప్రవర్తించారు.  అప్పు చెల్లించినా అదనపు వడ్డీ చెల్లించలేదన్న ఆగ్రహంతో ఆ మహిళను వివస్త్రను చేసి, నోట్లో మూత్రం పోయించారు. ఈ ఘటన పాట్నాలోని ఖుస్రుపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. ఈ ఘటనపై ఫిర్యాదు చేసినట్లు పోలీసు అధికారులు సోమవారం తెలిపారు. నిందితులు ప్రమోద్‌ సింగ్‌, అతని కుమారుడు అన్షుసింగ్‌లు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితురాలు ఆస్పత్రిలో చిక్సి పొందుతోందని అన్నారు.

నా భర్త కొన్ని నెలల క్రితం ప్రమోద్‌ సింగ్‌ నుండి రూ. 1500 అప్పుగా తీసుకున్నాడు. . ఆ డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించినా.. అదనపు వడ్డీ ఇవ్వాల్సిందేనని ప్రమోద్‌ సింగ్‌ డిమాండ్‌ చేశాడని బాధిత మహిళ పేర్కొంది. అందుకు అంగీకరించకపోవడంతో.. అదనపు వడ్డీ చెల్లించకపోతే గ్రామంలో నగంగా ఊరేగిస్తానని బెదిరించాడని తెలిపింది. దీంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని అన్నారు. ఈ ఫిర్యాదుపై విచారణ కోసం పోలీస్‌ బృందం శనివారం గ్రామంలో పర్యటించిందని బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న ప్రమోద్‌ గత శనివారం రాత్రి 10 గంటల సమయంలో అతడి అనుచరులతో కలిసి మహిళ ఇంటికి వెళ్లాడని, ఆమెను బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లి ఆమెపై దాడి చేశాడని అన్నారు. మహిళను వివస్త్రను చేసి కర్రలతో కొట్టించాడని, అనంతరం తన కుమారుడితో మహిళ నోట్లో మూత్రం పోయించాడని చెప్పారు. అక్కడి నుండి ఆమె తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.