ప్రజాశక్తి - మంత్రాలయం
భవ్యశ్రీని అతి కిరాతకంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వడ్డెర సంఘం గౌరవాధ్యక్షులు వడ్డే నారాయణ, జైభీమ్ ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ, వడ్డెర సంఘం నాయకులు వడ్డే విజరు కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులతో కలిసి స్థానిక రాఘవేంద్ర సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చిత్తూరు జిల్లా పెనమలూరు మండలం వేణుగోపాల పురానికి చెందిన విద్యార్థిని వడ్డెర భవ్యశ్రీని ముగ్గురు యువకులు అత్యాచారం చేసి హతమార్చారని తెలిపారు. గుర్తు పట్టకుండా ఉండేందుకు గుండు గీసి, కనుబొమ్మలను, నాలుకను కోసి చంపడం హేయమైన చర్య అని విమర్శించారు. ఈ సంఘటన జరిగి మూడు రోజులు గడిచినా స్థానిక ఎమ్మెల్యే రోజా స్పందించకపోవడం శోచనీయమన్నారు. వైసిపి ప్రభుత్వం మహిళల రక్షణ కోసం తెచ్చిన దిశ చట్టం అలంకార ప్రాయంగా మిగిలిందని విమర్శించారు. ఇది ప్రభుత్వానికి తీరని మచ్చ అని తెలిపారు. ప్రభుత్వం స్పందించి నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జై భీమ్ ఎంఆర్‌పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జి హనుమన్న మాదిగ, నాయకులు రత్నం మాదిగ, ఉపాధ్యాయులు పుష్పలత, సువర్ణ, సుహాసిని, వీణ, సుల్తానా, ఉమామహేశ్వరి, పిఇటి నరసింహ రాజు పాల్గొన్నారు. ఆదోని డివిజన్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదోనిలోని కార్యాలయంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు మాట్లాడారు. ఆదోని తాలూకా అధ్యక్షులు మరియాని చెన్నబసప్ప, అధ్యక్షులు డాక్టర్ వీరేష్, తాలూకా గౌరవ సలహదారులు దేవిశెట్టి ప్రకాష్, పట్టణ గౌరవ సలహాదారులు బి.రాముడు, బి.మల్లేశ్వరప్ప, మాల మహానాడు కుంకనూరు వీరేష్, కన్నే జగదీష్ పాల్గొన్నారు. కోసిగి మండలంలోని వడ్డెర కమిటీ సభ్యులు తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. నాయకులు విశ్వనాథ్, నాగరాజు, బసవరాజు, గోపాల్, లక్ష్మన్న, వీరేష్, రమేష్, ఈరన్న, వీరేష్, హుస్సేని, సురేష్, ఉలిగయ్య, పాండు, ఉలిగయ్య, బసవరాజు, లక్ష్మన్న, రాజు, నరసింహ, దేవా, కృష్ణ, తిమ్మప్ప, యంకప్ప, విశ్వనాథ్, గోవిందు, కేశవ, రామచంద్ర, ముక్కరన్న, రామయ్య, వెంకటేష్, సాయికుమార్ పాల్గొన్నారు.










