Aug 07,2023 20:04

తహశీల్దార్‌ కార్యాలయం వద్ద దీక్ష చేపట్టిన మాజీ సైనికుడు మహేష్‌

ప్రజాశక్తి-ఆలూరు
దేశం కోసం పోరాడిన తనకు ప్రభుత్వం ఇచ్చిన పొలాన్ని కాపాడుకోలేకపోతున్నాని మాజీ సైనికుడు మహేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తన పొలం నుంచి 53 సెంట్లు మరొకరి సర్వే నెంబర్‌లోకి అక్రమంగా చేర్చారని తెలిపారు. న్యాయం చేయాలంటూ 13 ఏళ్లుగా అధికారులకు, ముఖ్యమంత్రి, కలెక్టర్లకు విన్నవించినా న్యాయం జరగలేదని వాపోయారు. సోమవారం తహశీల్దార్‌ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలోని హత్తిబెళగల్‌ గ్రామ పరిధిలో 1979లో ప్రభుత్వం దళితులకు ల్యాండ్‌ సీలింగ్‌ ద్వారా 27 ఎకరాల భూమి ఇచ్చిందని తెలిపారు. తనకు సర్వే నెంబరు 622లో 2.96 ఎకరాల భూమిని ఇచ్చిందని చెప్పారు. అప్పటి నుంచి ఆ భూమిని తానే సాగు చేసుకుంటూ ఆలూరు స్టేట్‌ బ్యాంకులో 2.96 ఎకరాలకు పంట రుణం కూడా తీసుకున్నట్లు తెలిపారు. 2011లో తనకు కేటాయించిన భూమిలో 53 సెంట్ల భూమిని మరొకరి సర్వే నెంబరులో రెవెన్యూ అధికారులు చేర్చారని చెప్పారు. ప్రస్తుతం తనకు 2.43 ఎకరాల భూమి మాత్రమే ఉన్నట్లు ఆన్‌లైన్‌లో చూపుతోందని అన్నారు. అవకతవకలపై 2015లో రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సర్వే చేయిస్తే తన భూమిలో ఉండాల్సిన 53 సెంట్లు పక్కనే ఉన్న హత్తిబెళగల్‌కు చెందిన నల్లన్న కుమారుడు గుండప్ప పొలంలో కలిసినట్లు తేలిందన్నారు. గుండప్పకు ప్రభుత్వం ల్యాండ్‌ సీలింగ్‌ భూమి ఇస్తే ఆ భూమి ప్రస్తుతం ప్రభాకరయ్య పేరుతో ఉందని తెలిపారు. గుండప్ప పేరు మార్చుకొని ప్రభాకరయ్యగా చలామణి అవుతూ తమ భూమిలోని 53 సెంట్ల భూమిని కబ్జా చేశారని విమర్శించారు. ఆర్‌టిఐ యాక్ట్‌, ప్రజాదర్బార్‌, స్పందన వంటి కార్యక్రమాల్లో కలెక్టర్‌, ఆర్‌డిఒలకు అర్జీలు ఇస్తూనే ఉన్నా ఏ ఒక్క అధికారి కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకెందుకు న్యాయం చేయడం లేదని, ఎవరికి భయపడి తన భూమిని తనకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయానని, తహశీల్దార్‌ కార్యాలయం వద్ద దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ఈ విషయం ఆర్‌డిఒ కోర్టులో ఉందని తహశీల్దార్‌ రామాంజినేయులు తెలిపారు.
దీక్షకు మాజీ సైనికుల మద్దతు
భూమి కోసం దీక్ష చేపట్టిన మాజీ సైనికుడు మహేష్‌కు మాజీ సైనిక ఉద్యోగుల సంఘం నాయకులు శివ ప్రసాద్‌, కుళ్లయ్య, ఖాజా, బాటప్ప, తిమ్మప్ప, రామకృష్ణ, నాగరాజు, గోవిందు, రామచంద్ర మద్దతు తెలిపారు. న్యాయం జరగకపోతే ఆర్‌డిఒ కార్యాలయం వద్ద నిరాహారదీక్ష చేపడతామన్నారు.