Oct 12,2023 20:32

భూమికి సంబంధించిన ఆధారాలు చూపుతున్న వెంకటేశ్వర రెడ్డి

ప్రజాశక్తి - ఆదోని
ఆదోనిలో ఎమ్మెల్యే అండతో ఎవరూ భూకబ్జాలకు పాల్పడలేదని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని వైసిపి సీనియర్‌ నాయకులు వెంకటేశ్వర రెడ్డి, అక్షరశ్రీ రామకృష్ణారెడ్డి హితవు పలికారు. గురువారం 352 సర్వే నెంబర్‌ ఇంటి స్థలాల ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 32 ఏళ్లుగా 352 సర్వే నెంబర్‌ వివరాలను, కొనుగోలు చేసిన పత్రాలను, జరిగిన అక్రమాలు బినామీ రిజిస్ట్రేషన్లు, ఒక్కో ప్లాటును రెండు, మూడుసార్లు అమ్మిన వివరాలను వెల్లడించారు. 352 సర్వే నెంబర్లు హక్కుదారుల నుంచి కొనుగోలు చేయకుండానే దత్తాత్రేయ అనే వ్యక్తి వచ్చి స్థలాన్ని కొనుగోలు చేశానని, న్యాయం చేయకపోతే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారని తెలిపారు. దీనిపై విచారిస్తే నకిలీ మనిషితో రిజిస్టర్‌ చేయించుకుని బెదిరిస్తున్నారని, అతనిపైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని చెప్పారు. 352 సర్వేనెంబర్‌లో హమీద్‌ అనే వ్యక్తి చంద్రమ్మ అనే మహిళ ద్వారా రెండెకరాల భూమిని కొనుగోలు చేసి ప్లాట్‌ వేసి 1991లో 73 మందికి విక్రయించారని తెలిపారు. మొదట 73 మందికి ప్లాట్లు అమ్మిన హమీద్‌ మరోసారి 80 మందికి ప్లాట్లు అమ్ముకుని డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేయించారన్నారు. మరోపక్క ఆబిద్‌ అనే వ్యక్తి 4.24 ఎకరాలను చంద్రమ్మ ద్వారా అగ్రిమెంట్‌ చేయించుకుని 187 మందికి ప్లాట్లు విక్రయించారని తెలిపారు. 2016లో హర్ష అనే వ్యక్తి ఇదే భూమిపై మళ్లీ ప్లాట్లు వేసి అమ్ముకున్నారని చెప్పారు. మళ్లీ 2019లో ఎరుకల సూరి అనే వ్యక్తి హమీద్‌ నుంచి 60 సెంట్ల భూమిని కొనుగోలు చేసి ప్లాట్లు అమ్ముకున్నారని వివరించారు. మొత్తం నాలుగు ఎకరాల భూమిలో 421 మంది బాధితుల ప్లాట్లు ఉన్నాయని, వీరందరూ న్యాయం చేయాలని 2019లో ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డిని ఆశ్రయించారని తెలిపారు. ఆయన ఎన్నికల అనంతరం ఈ సమస్యను సిసిఎల్‌ఎ దృష్టికి తీసుకెళ్లి పూర్తి వివరాలను తెచ్చి బాధితులకు న్యాయం చేసే విధంగా ఒక్కో ప్లాటును రూ.1.60 లక్షలు చెల్లించే విధంగా ఒప్పందం కుదిరిచ్చి తమ ద్వారా చెల్లించారన్నారు. రిజిస్ట్రేషన్‌ ఆలస్యం కావడంతో డబ్బులు చెల్లించడం ఆలస్యమైందని, అంతే తప్ప తామెవరికీ డబ్బులు ఇవ్వకుండా అన్యాయం చేయలేదని తెలిపారు. రెండు రోజుల క్రితం వచ్చిన దత్తాత్రేయ అనే వ్యక్తి 2015 హమీద్‌ అనే పేరు ఉన్న వ్యక్తిని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేకుకుంట గ్రామం నుంచి తీసుకొచ్చారని చెప్పారు. అదే రోజు ఆధార్‌ కార్డు నమోదు చేయించి ఎన్‌ఐఎ కాపీ ద్వారా ఆదోనిలో కాకుండా ఎమ్మిగనూరులో ఈ 352 భూమిలో 50 సెంట్ల స్థలాన్ని రిజిస్టర్‌ చేయించుకున్నారని తెలిపారు. కుట్రపూరితంగానే దత్తాత్రేయను ఈ సర్వే నెంబర్లలోకి తెచ్చారని చెప్పారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని, న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. ఒక ప్లాట్‌ను కొనుగోలు చేసిన ఇద్దరు, ముగ్గురు బాధితులకు ధరలపై 82 నుంచి 85 శాతం వరకు ధర కట్టించినట్లు చెప్పారు. ఇందులో ఎవరికీ అన్యాయం జరగలేదని, అనవసరంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డిపైనా, ఎమ్మెల్యే తనయుడు జయమనోజ్‌ రెడ్డిపైనా ఆరోపణలు చేయడం మానుకోవాలని తెలిపారు. సంబంధం లేని ఒక వ్యక్తి వచ్చి న్యాయం చేయాలని ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే దానిని వైసిపిపై, నాయకులపై వేయడం తగదన్నారు. 352 సర్వే నెంబర్‌ భూమిలో ప్లాట్లు వేసి అమ్మకాలు చేసిన హమీద్‌ మాట్లాడుతూ... తాను దత్తాత్రేయ అనే వ్యక్తికి ఎలాంటి భూమీ అమ్మలేదని, తన అవసరాల నిమిత్తం డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేయించానని తెలిపారు.