May 24,2023 22:45

సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ చేతన్‌

ప్రజాశక్తి - పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో వివిధ జాతీయ రహదారులకు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌ చేతన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ లోని తన చాంబరులో భూ సేకరణ పై ఆర్డీవోలు, తహశీల్దార్లు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన భూ సేకరణ పక్రియ, పెండింగ్‌ పనులపై జెసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు భూ సేకరణ సకాలంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ కొడికొండ చెక్‌ పోస్ట్‌, హిందూపురం 544 రహదారి, నేషనల్‌ హైవే 44 ఇతర రహదారులకు భూ సేకరణ సకాలంలో పూర్తి చేయాలన్నారు. భూ సేకరణ పూర్తి అయితే రహదారులు, రైల్వే పనులు త్వరగతిన పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఆర్డీవో స్థాయి అధికారులు వీటి పైన ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి, కదిరి ఆర్డీవోలు భాగ్యరేఖ, రాఘవేంద్ర, ఎన్‌హెచ్‌ అధికారులు, ఆయా మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు.