గరుగుబిల్లి: స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట గొట్టివలస రైతులు తమ భూములను అటవీశాఖకు బదలాయించే చర్యకు నిరసనగా ఆందోళన నిర్వహించి తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు బివి రమణ, కరణం రవీంద్ర మాట్లాడుతూ గొట్టివలస రెవెన్యూ పరిధిలోని 272, 273, 274 సర్వే నెంబర్లలో సుమారు 34 మందికి పట్టాలను 2008లో మంజూరు చేశారని నాటి నుండి నేటి వరకూ ఆ భూమిని రైతులు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారని అన్నారు. ఈ భూమికి సంబంధం లేని 279 సర్వేనెంబర్ లోని భూమిని అటవీ శాఖకు ఇస్తున్నట్టు నివేదిక రూపొందించిన రెవెన్యూ అధికారులు 272, 273, 274 సర్వే నెంబర్ల పరిధిలో పట్టాలు పొంది సాగులో ఉన్న రైతులను భూముల నుండి తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కనీసం రైతులకు సమాచారం ఇవ్వకుండా రైతులు అనుమతి లేకుండా ఏ నిబంధన ప్రకారం అటవీ శాఖకు బదిలీ చేసారని ప్రశ్నించారు. రైతులను మభ్య పెట్టి తప్పుడు సర్వే నంబర్లు సృష్టించి అడ్డగోలుగా రైతులను భూముల నుండి తొలగించే చర్యలను అంగీకరించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం నిబంధనలు పాటించాలని నిబంధనలకు విరుద్ధంగా పేద రైతులను భూముల నుండి వెళ్ళగొట్టే ప్రయత్నాలను ఉపసంహరిం చుకోకపోతే రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం రైతుల వద్ద ఉన్న పట్టా దారు పాసుపుస్తకాలతో సహా ఆధారాలను ఉప తహశీల్దార్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు బోను శంకర్రావు, నాగభూషన్ రావు తదితరులు పాల్గొన్నారు.










