కళాశాల ఎదుట ట్రిపుల్ ఐటి విద్యార్థుల ఆందోళన
ప్రజాశక్తి - నూజివీడు రూరల్
'నీళ్ల చారు.. లావు బియ్యంతో అన్నం.. పులిసిన పెరుగు.. నాణ్యత లేని కూరలు తినలేకపోతున్నాం.. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవడం లేదు. మాకు నాణ్యమైన భోజనం పెట్టండి.. ఈ భోజనం తినలేకపోతున్నాం' అంటూ నూజివీడు ట్రిపుల్ ఐటి విద్యార్థులు శనివారం ఆ కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. తమకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించే చర్యలు చేపట్టే వరకూ ఆందోళన విరమించేది లేదని వారు భీష్మించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ తమకు లావు బియ్యంతో భోజనం పెడుతున్నారని, దీంతో అన్నం చిమిడిపోయి ఉంటుందని, తినలేకపోతున్నామని తెలిపారు. ఒక్కో విద్యార్థికి భోజనం నిమిత్తం రూ.90 నుంచి 110 వరకూ ప్రభుత్వం అందిస్తుందని, ఆ మొత్తంతో విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించవచ్చని, కానీ కాంట్రాక్టర్ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. నాశిరకం కూరగాయలు, బియ్యంతో భోజనం వండి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భోజనం తిని తరచూ అనారోగ్యానికి పాలవుతున్నామని, కొన్ని సందర్భాల్లో పస్తులుంటున్నామని వారు వాపోయారు. ఇక్కడ భోజనం తినలేక తప్పనిసరి పరిస్థితుల్లో క్యాంపస్‌లో ఉన్న మరో ప్రయివేటు క్యాంటిన్‌లో భోజనం చేస్తున్నామని, దీనివల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. అంతేకాక ఈ కళాశాలలో భోజనం, ఫ్యాకల్టీ సరిగా లేకపోవడం, విద్యాబోధనలో ఒత్తిడి వల్ల గతంలో 20 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని, దీనిపై విచారణ చేపట్టాలని కోరినా కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనకు ఎస్‌ఎఫ్‌ఐ, సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లెనిన్ మాట్లాడుతూ ట్రిపుల్ ఐటి విద్యార్థుల సమస్యలపై పలుమార్లు ఆందోళన చేపట్టామని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేశామని అయినా కనీసం పట్టించుకోలేదన్నారు. మెస్ నిర్వహణ సరిగా లేదని, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
మెస్ నిర్వహణ అధ్వానం : సిపిఎం
నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనకు సిపిఎం జిల్లా కమిటీ మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు విద్యార్థుల సమస్యలపై వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. మెస్ నిర్వహణ అధ్వానంగా ఉందంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారని, నీళ్ల చారు, పులిసిపోయిన పెరుగు పెడుతున్నారని ఆందోళన చేయడం వారి సమస్య తీవ్రతను తెలియజేస్తుందన్నారు. మెస్ నాణ్యతను పెంచాలని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని కోరారు. విద్యార్థులు చేస్తున్న ఆందోళన న్యాయబద్ధమైనదని తెలిపారు. సమస్య పరిష్కారానికి డైరెక్టర్ కృషి చేయాలని కోరారు.
మెస్ కమిటీ ఏర్పాటు చేస్తాం
విద్యార్థుల ఆందోళనతో స్పందించిన నూజివీడు సబ్‌కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. భోజనశాలను పరిశీలించి ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపిస్తామని చెప్పారు. కళాశాల డైరెక్టర్ శ్రీనివాస్ భోజన నాణ్యతపై మెస్ కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కమిటీలో మెంబర్స్‌తో పాటు విద్యార్థులు కూడా ఉంటారని తెలిపారు. నిత్యం మెస్‌లో ఆహారాన్ని తనిఖీ చేయడం, నాణ్యత ప్రమాణాలతో విద్యార్థులకు భోజనం అందించేలా తగిన చర్యలు చేపడతామని తెలిపారు. అనంతరం విద్యార్థులు ఆందోళన విరమించారు.
ఏలూరు:నూజివీడు ట్రిపుల్ ఐటి విద్యార్థులకు పెడుతున్న భోజనం నాణ్యంగా ఉండటం లేదని, తినేందుకు ఇబ్బందులు పడుతున్నారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్ అన్నారు. స్థానిక ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లెనిన్ మాట్లాడారు. భోజనం బాగోలేదని అనేకసార్లు అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోలేదన్నారు. ఇప్పటివరకూ నూజివీడు త్రిపుల్ ఐటిలో 20 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని దాని గురించి సరైన విచారణ కూడా జరిపించలేదన్నారు. భోజనం నిమిత్తం ఒక్కో విద్యార్థికి రూ.90 నుంచి రూ.110 వరకూ ప్రభుత్వం చెల్లిస్తుందని, కానీ నాణ్యమైన భోజనం పెట్టడంలో అధికారులు, మెస్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. భోజనం విషయంలో అనేకసార్లు అధికారుల దృష్టికి ఎస్‌ఎఫ్‌ఐ తీసుకెళ్లినా, సరి చేస్తామని చెప్పి నాలుగు రోజులు సక్రమంగా పెడుతున్నారని, తర్వాత షరామామూలైపోతుందని విమర్శించారు. సమస్యను పరిష్కరించకుంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు యశ్వంత్, వినోద్ పాల్గొన్నారు.










