ప్రజాశక్తి-గుత్తి : విప్లవీరుడు భగత్ సింగ్ జయంతిని గుత్తిలో గురువారం జన విజ్ఞాన వేదిక, భగత్ సింగ్, బోస్ యూత్ కమిటీ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని సత్రం మిట్ట సమీపంలో ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్ ఎం.రంగన్న మాట్లాడుతూ భగత్ సింగ్ ఆశయాలను నెరవేర్చే విధంగా యువత ముందుకు రావాలని అన్నారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు పి.వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ భగత్ సింగ్ అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన నాయకుడని భగత్ సింగ్ యొక్క స్ఫూర్తితో ముందుకెళ్లాలని అన్నారు. భగత్ సింగ్ బోస్ కమిటీ నాయకుడు నిజాముద్దీన్ మాట్లాడుతూ యువత భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు సి. రమేష్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి దేశం పట్ల స్వతంత్రం రావడానికి కృషి చేసినటువంటి నాయకుల గురించి తెలుసుకోవడం విద్యార్థులకు చాలా ముఖ్యమని విద్యార్థులు అందరు కలిసిమెలిసి ఉండాలన్నారు. కార్యక్రమంలో జెవివి నాయకులు దేశాయి నాగరాజు, యుటిఎఫ్ మండల అధ్యక్షులు అహోబిలేసు, కోట గైడ్ రమేష్, భగత్ సింగ్, బోస్ యూత్ కమిటీ నాయకులు రమేష్, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.










