Sep 25,2023 20:59

పార్వతీపురంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న అంగన్వాడీలు

కనీస వేతనాలు అమలు చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై అంగన్వాడీలు భగ్గుమన్నారు. ఏళ్ల తరబడి వెట్టిచాకిరీ చేయించుకుంటూ, సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న పాలకుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సమస్యల పరిష్కారం కోసం శాంతియుత నిరసనకు పిలుపునిస్తే ప్రభుత్వం పోలీసుల ద్వారా అణచివేత చర్యలకు పాల్పడటాన్ని ఖండించారు. నిర్బంధాలు, అరెస్టులకు వ్యతిరేకంగా జిల్లాలో పలుచోట్ల సోమవారం నిరసనలు చేపట్టారు.

ప్రజాశక్తి-పార్వతీపురం : 
అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన పార్వతీపురంలోని సుందరయ్య భవనం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు ఎం.ఉమామహేశ్వరి మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ చూపించకుండా, ప్రజాస్వామ్యంలో హక్కులను కాలరాస్తూ నిర్బంధించడాన్ని ఖండించారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి చెల్లించాలన్నారు. మినీ సెంటర్లను ప్రధాన కేంద్రాలుగా మార్చాలని, ఫేస్‌ యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని కోరారు. అనంతరం యూనియన్‌ నాయకులు వి.ఇందిర మాట్లాడారు. వీరి ఆందోళనకు సిఐటియు జిల్లా కార్యదర్శి జి.వెంకటరమణ, యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.రమేష్‌, ఎస్‌.మురళీమోహన్‌రావు, ఐద్వా జిల్లా కార్యదర్శి ఆర్‌.శ్రీదేవి మద్దతిచ్చారు. అనంతరం ఐసిడిఎస్‌ పీడీ విజయగౌరికి వినతి అందించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి.సూరిబాబు, యూనియన్‌ నాయకులు ఎం.గౌరి, వి.ధర్మవతి, దాలమ్మ, సత్యవతి, స్వర్ణ, శైలజ, సావిత్రి, జ్యోతి పాల్గొన్నారు. అంగన్వాడీల అరెస్టులను పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసిరావు ఖండించారు.
సాలూరు : ప్రజా ఉద్యమాలను అణచి వేయాలని చూస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు హెచ్చరించారు. పట్టణంలో మున్సిపల్‌ కార్యాలయ జంక్షన్‌ నుంచి బోసుబొమ్మ జంక్షన్‌ వరకు అంగన్వాడీలు ర్యాలీ చేపట్టారు. అనంతరం అక్కడ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌వై నాయుడు మాట్లాడుతూ చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్ళకుండా గృహ నిర్బంధంలో ఉన్న అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ సాలూరు అర్బన్‌ ప్రాజెక్టు అధ్యక్షురాలు బి.రాధ, పాచిపెంట ప్రాజెక్టు యూనియన్‌ అధ్యక్షురాలు ప్రభావతిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ సెక్టార్‌ నాయకులు శ్యామల, సత్యవతి, రమణమ్మ పాల్గొన్నారు.
పాలకొండ : పాలకొండలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌.హిమప్రభ, కోశాధికారి బి.అమరవేణి మాట్లాడుతూ సిఎం జగన్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని అనేక పర్యాయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లినా, అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాంతియుతంగా విజయవాడలో మహాధర్నాకు పిలుపునిస్తే అంగన్వాడీ కార్యకర్తలను గృహనిర్బంధాలు, అరెస్టులు చేయడం దారుణమన్నారు. అంగన్వాడీ సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కె.రాము, నాయకులు ఎం.వీరనాయుడు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు ఆర్‌.భవాని, జి.జెస్సీబారు, టి.నిర్మల, ఎన్‌.మణి, వై.మణి, ధనలక్ష్మి, నాగరాణి, ఇందిర, సీతమ్మ, శ్రీదేవి, కె.శారద, ఎం.శ్యామల తదితరులు పాల్గొన్నారు.
కొమరాడ : అంగన్వాడీలపై నిర్బంధాన్ని, అక్రమ అరెస్టులను సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి ఖండించారు. నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు.