భారీ వర్షం - రైతుల్లో ఆనందం
- కొత్తపల్లి మండలంలో 103.8 మి.మీ
- పాములపాడులో పొంగిపొర్లిన వాగులు, వంకలు
- వెలుగోడులో కాలనీలు జలమయం
- ఆత్మకూరులో చెరువులను తలపించిన పంట పొలాలు
ప్రజాశక్తి - కొత్తపల్లి
కొత్తపల్లి మండలంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలకరి నుంచి వర్షాలు లేక అరకొరగా అక్కడక్కడ కురిసిన వర్షాలకు కొన్ని గ్రామాల్లో రైతులు మొక్కజొన్న, పత్తితో పాటు పలు పంటల విత్తనాలు నాటారు. అప్పటినుంచి వర్షాలు లేక విత్తనాలు మొలకెత్తుతాయో లేదోనని ఎదురు చూస్తున్న తరుణంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం ప్రాణం పోసింది. మండలంలో ఏకంగా 103.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. దీంతో నేటి వరకు విత్తనాలు వేయని రైతులు విత్తనాలు వేసే పనిలో బిజీబిజీగా అయ్యారు. ఆలస్యంగానైనా సమృద్ధిగా వర్షం కురిసిందని పలు గ్రామాల రైతులు పేర్కొంటున్నారు.
నీట మునిగిన పంటలు
పాములపాడు : మండలంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురవడంతో మొక్కజొన్న, ఇతర పంటలు నీటమునిగాయి. కొంతమంది రైతుల పొలాలు మొక్కజొన్న మొలక స్టేజిలో ఉండడంతో నీరు నిల్వ వున్న ప్రదేశాల్లో పంట మొత్తం నష్టం అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం
చెరువులను తలపించిన పొలాలు
ఆత్మకూర్ : ఆత్మకూరు మండలంలో మంగళవారం రాత్రి నుండి బుధవారం తెల్లవారుజామున వరకు భారీ వర్షం పడింది. మండలంలోని పంట పొలాల్లో నీరు నిలవడంతో చెరువులను తలపించాయి. రైతులు పంట పొలాల్లో వేసుకోవలసిన విత్తనాల కోసం ప్రైవేట్ షాపుల వద్ద కొనుగోలుకు పెద్ద ఎత్తున గుమ్మిగూడారు. మండలంలోని శివ భాష్యం గౌడ్ ప్రాజెక్ట్‌లో సగానికి పైగా వర్షం నీరు చేరినట్లు తెలిసింది.
ప్రధాన రహదారితో పాటు కాలనీలు జలమయం
వెలుగోడు : వెలుగోడు పట్టణంలో బుధవారం వేకువ జామున భారీ వర్షం కురవడంతో గండిపేట, సిపి నగర్, ద్వారకానగర్, లక్ష్మీ నగర్, వెంగళ రెడ్డి పేట కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. నంద్యాల-ఆత్మకూరు ప్రధాన రహదారిలో ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర వర్షపు నీరు ఎక్కువగా నిలవడంతో ఉదయం రాకపోకలకు కాస్త అంతరాయం కలిగింది. వెలుగోడు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ వేల్పుల జైపాల్ జెసిబి సహాయంతో నీటి కాలువకు అడ్డుగా ఉన్న మట్టిని తవ్వి సమస్యను పరిష్కరించారు. ఇళ్లలోకి వర్షపు నీరు చేరుకున్న బాధితులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనాన్ని ఏర్పాటు చేయించారు. ఆయన వెంట వెలుగోడు మండల ఎంపీపీ రమేష్, వైసిపి నాయకులు షంషీర్, రామ్మోహన్ రెడ్డి, పాన్ షాప్ మాలిక్ ఉన్నారు.










