సాలూరు : పట్టణంలో ఈనెల 8న నిర్వహించనున్న సామాజిక సాధికారత బస్సు యాత్రను విజయవంతం చేయాలని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కోరారు. సోమవారం డిప్యూటీ సిఎం రాజన్నదొర నివాసంలో బస్సుయాత్ర కు సంబంధించిన ఏర్పాట్లపై నియోజకవర్గం లోని నాలుగు మండలాలు, పట్టణ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిర్వహించనున్న సామాజిక సాధికారత బస్సు యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 20వేలకు పైబడి జనం సమీకరణ చేయాలన్నారు. ఆటోలు, ట్రాక్టర్లు, మినీ వ్యాన్‌ల్లో కార్యకర్తలు, అభిమానులను తరలించాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు నిర్దేశించిన ప్రదేశాలలో వాహనాలను నిలిపి వేయాలని కోరారు.
అంతా సహకరిస్తేనే పోటీ చేస్తా : డిప్యూటీ సిఎం ఆసక్తికర వ్యాఖ్యలు
అనంతరం డిప్యూటీ రాజన్నదొర మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అందరూ సహకరిస్తామంటే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, లేదంటే ఎంపీగా పోటీ చేస్తానని అన్నారు. రెండూ వద్దంటే మానేస్తానని, తన ఆరోగ్యం బాగుండడం లేదని చెప్పారు. పాడేరు, అనకాపల్లి బస్సు యాత్ర లు విజయవంతమయ్యాయని, సాలూరు సభను అంతకంటే ఎక్కువ జనసమీకరణతో విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మక్కువ మండల సీనియర్ నాయకులు మావుడి శ్రీనివాసరావు నాయుడు మాట్లాడుతూ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం రాజన్నదొర ఆవిధంగా మాట్లాడి వుండరాదని చెప్పారు. ఆయనకు పోటీ చేయాలని ఆసక్తి లేదని చెబితే పార్టీ కొత్త అభ్యర్థి ని ఎంపిక చేస్తుందని చెప్పారు.కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ, వైస్ చైర్మన్ లు జర్జాపు దీప్తి, వంగపండు అప్పలనాయుడు, జెసిఎస్ కన్వీనర్ గిరిరఘు, పలువురు కౌన్సిలర్లు, ఎఎంసి చైర్‌పర్సన్ దండి అనంతకుమారి, వైస్ ఎంపిపి రెడ్డి సురేష్, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు,దండి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
సీతానగరం : పార్వతీపురంలో ఈనెల 10న జరుగు బిసి సామాజిక బస్సు యాత్రను జయప్రదం చేయాలని టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, రాష్ట్ర ఎస్సీ మహిళా కమిషన్ సభ్యులు సవరపు జయమణి కోరారు. ఈ మేరకు సోమవారం సీతానగరం జంక్షన్‌లో ఉన్న రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జయమణి స్వగృహంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు వివరించి త్వరలో జరగబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని అత్యధికంగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పెదభోగిలి ఉపసర్పంచ్ కె.అరవింద్‌కుమార్, వైసిపి నాయకులు ఎస్ వెంకటరమణ, రామారావు, కొండలరావు పాల్గొన్నారు.










