Oct 09,2023 22:15

ఉమ్మడి జిల్లాలో జోరుగా క్రికెట్‌ పందేలు
ప్రపంచ కప్‌ నేపథ్యంలో రెచ్చిపోతున్న బుకీలు
బైండోవర్‌లు, తనఖీలు లేని పరిస్థితి
పోలీసుల నిర్లక్ష్యంపై సర్వత్రా చర్చ
పలు జిల్లాల్లో ఎస్‌పిలే నేరుగా రంగంలోకి
స్పెషల్‌ బ్రాంచ్‌ వైఫల్యమే కారణం


ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి : ఉమ్మడి జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. బంతిబంతికీ పందేలు కాస్తూ బుకీలు రెచ్చిపోతున్నారు. మ్యాచ్‌ మొదటి బంతి నుంచి ఆఖరి బాల్‌ వరకూ ఈ బెట్టింగ్‌ల జోరు కొనసాగడంతో కోట్లాది రూపాయలు చేతులుమారుతున్నాయి. ఇంతలా బెట్టింగ్‌లు జరుగుతున్నప్పటికీ పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కోడి పందేల నుంచి అన్ని బెట్టింగ్‌ల్లోనూ ఉభయగోదావరి జిల్లాలు కేరాఫ్‌ అడ్రస్‌ మారుతున్నాయని పలువురు పేర్కొనడం విశేషం. సాధారణ క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగేటప్పుడే బెట్టింగ్‌లు పెద్దఎత్తున సాగే జిల్లాలో ఇక ప్రపంచకప్‌ క్రికెట్‌ పోటీల నేపథ్యంలో బెట్టింగ్‌ల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. క్రికెట్‌ బెట్టింగ్‌లు పెద్దఎత్తున జరుగుతాయని తెలిసినా పోలీసులు మాత్రం తమకు సంబంధంలేదన్నట్లు వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతంలో అనేక మంది క్రికెట్‌ బుకీలను పట్టుకుని చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. ప్రపంచకప్‌ టోర్నీలు జరిగే సమయంలో గతంలో పట్టుబడిన క్రికెట్‌ బుకీలకు, అందుకు సహకరిస్తున్న వారిని ముందస్తుగా బైండోవర్‌ చేయడం, హెచ్చరించడంతోపాటు, నిరంతరం పోలీసుల నిఘా కొనసాగుతోంది. ఈనెల ఐదో తేదీన ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్ని ప్రారంభమైంది. ఈసారి ఇండియాలోనే ప్రపంచ టోర్నీ జరుగుతోంది. దీంతో ఇండియా కప్‌ గెలవాలని సగటు భారతీయులంతా కోరుకుంటారు. మిగిలిన దేశాల మ్యాచ్‌లు జరిగినప్పుడుకంటే ఇండియా బరిలో దిగిన మ్యాచ్‌ల సమయంలో క్రికెట్‌ బెట్టింగ్‌లు రూ.కోట్లలో సాగుతాయి. ఇటీవల ఆదివారం జరిగిన ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌పై రూ.కోట్లలో క్రికెట్‌ బెట్టింగ్‌లు జరిగినట్లు సమాచారం. పెద్దఎత్తున సొమ్ములు చేతులు మారినట్లు ప్రచారం సాగుతుంది. బుకీలు ఆన్‌లైన్‌ ద్వారా యువతను బెట్టింగ్‌ల ఉచ్చులోకి లాగుతున్నారు.
గతంలో క్రికెట్‌ బెట్టింగ్‌ల్లో సొమ్ములు పోగొట్టుకుని ఎంతోమంది యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. కొందరు యువకులు అప్పులపాలై ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డారు. పెదవేగి మండలం భోగాపురం గ్రామానికి చెందిన నరేష్‌ అనే వ్యక్తి క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడి, భారీగా డబ్బుపోగొట్టుకుని చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలాంటి అనేక ఘటనలు జిల్లాలో జరిగాయి. హోటల్‌ గదుల్లో, బడ్డికొట్టుల్లో ఎక్కడిపడితే అక్కడ క్రికెట్‌ బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఏ బంతికి ఎన్ని పరుగులు వస్తాయో కూడా బెట్టింగ్‌లు కడుతున్నారు. బెట్టింగ్‌ల ఉచ్చులోపడి ముఖ్యంగా చదువుకునే యువత తప్పుదోవ పడుతోంది. ప్రపంచ కప్‌ వంటి పెద్దటోర్నీ జరిగేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులు అసలు పట్టన్నట్లు వ్యవహరించడం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసుల నిఘా కొనసాగుతుందన్న సంకేతాలు సైతం లేకుండాపోయాయి. దీంతో తమను ఎవరు ఆపేదంటూ బెట్టింగ్‌ రాయుళ్లు మరింత రెచ్చిపోతున్నారు. రాయలసీమ వంటి జిల్లాలో సైతం నేరుగా ఎస్‌పిలే రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహిస్తూ క్రికెట్‌ బెట్టింగ్‌లపై ఉక్కుపాదం మోపుతున్నారు.
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం క్రికెట్‌ బెట్టింగ్‌లకు అడ్డుకట్ట వేసేవిధంగా ఎలాటి చర్యలూ తీసుకున్న పరిస్థితి కనిపించడం లేదు. దీంతో పోలీసులు ఇంత మౌనంగా ఉన్నారేంటి అంటూ పెద్దఎత్తున విమర్శలు జనాల్లో వ్యక్తమవుతున్నాయి. ఈనెల 14వ తేదీన ఇండియా-పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇక ఆ రోజు బెట్టింగ్‌ల రోజు పెద్దఎత్తున సాగనుందని అంచనా వేస్తున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే అమాయక ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. జిల్లాలోని అన్ని పట్టణ ప్రాంతాల్లోనూ క్రికెట్‌ బెట్టింగ్‌ల జోరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ బెట్టింగ్‌లకు సంబంధించి ఉన్నతాధికారులకు సరైన సమాచారం అందించడంలో స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగం విఫలమైందన్న చర్చ సైతం ప్రజల్లోనూ, పోలీసుల్లోనూ నడుస్తోంది.