పాఠశాలలో బండ విరిగిపడి చిన్నారి మృతి
పుట్టినరోజే చివరిరోజు..
తల్లడిల్లిన కన్నపేగు
గుంతకల్లులో పెను విషాధ ఘటన
గుంతకల్లు : ఒక్కగానొక్క కూతురు... ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్నారు. తమ సర్వశం కూతురే అని భావించారు. వినాయక చవతి ఉత్సవాలు పైగా తమ ముద్దుల కమార్తె పుట్టినరోజు ఒకేసారి రావడంతో ఆ తల్లిదండ్రులు పట్టలేని ఆనందంతో వేడుక జరిపేందుకు సిద్ధం అయ్యారు. ఉదయాన్ని 'పుట్టిన రోజు శుభాకాంక్షలు చిట్టి తల్లి' అని నిద్రలేపారు. కొత్తబట్టలు వేసి మహాలక్ష్మిలా అలంకరించారు. బుడిబుడి అడగులేస్తూ ఆచిన్నారి కాలనీలోని వారికి చాకెట్లను అందించింది. చిన్నారి మోములో చిరునవ్వును చూసి తల్లిదండ్రులే కాదు.. కాలనీవాసులూ మురిసిపోయారు. అయితే ఈ ఆనందం గంటల వ్యవధిలోనే ఆవిరయ్యింది. పాఠశాలలో స్నేహితులకు చాక్లెట్లు ఇచ్చేందుకు వెళ్లిన చిన్నారికి అదే చివరి రోజు అయ్యింది. తరగతి గదికి ఏర్పాటు చేసిన బండి విరిగిపడడంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. చిరునవ్వుతో ఇంటి నుంచి వెళ్లిన కూతురు మృత్యుఒడికి చేరడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యవంతం అయ్యారు. విగతజీవిగా పడిఉన్న కూతురును చూసిన కన్నపేగు తల్లిడిల్లిపోయింది. గుంతకల్లులో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
గుంతకల్లు పట్టణం పాతగుంతకల్లుకు చెందిన బోయ రంగయ్య, శిరీషాలు దంపతులు. రంగయ్య ప్రయివేటు ఉద్యోగికాగ, శిరీష వార్డు వాలంటీర్‌గా పని చేస్తున్నారు. వీరికి ఒక్కగానొక్క కుమార్తె కీర్తన(4) ఉంది. ఈ చిన్నారి పట్టణంలోని శ్రీవిద్య ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ఎల్‌కెజీ చదువుతోంది. శుక్రవారం చిన్నారి పుట్టిన రోజుకావడంతో తల్లిదండ్రులు కూతురుకు కొత్తబట్టలు వేసి అందంగా ముస్తాబు చేశారు. పుట్టినరోజు నాడు స్నేహితులకు చాక్లెట్లు ఇచ్చేందుకు కూతుర్ని పాఠశాలకు తీసుకెళ్లారు. సాయంత్రం 3గంటల సమయంలో తరగతి గదికి ఏర్పాటు చేసిన బండ విరిగిచిన్నారిపై పడింది. తలపై పడడంతో చిన్నారి ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మరణించింది.
పాఠశాలక వెళ్లకున్నా బతికుండే దానివే...
'చాక్లెట్లు ఇచ్చి వస్తానని పాఠశాలలకు వెళ్లావమ్మా కదమా.. ఇంతలోని ఇంత ఘోరం జరిగిందా.. పాఠశాలకు వెళ్లకున్నా బతికుండేదానివి కదమ్మా.. బంగారు తల్లీ ఒక్కసారి లేవమ్మా'.. అంటూ చిన్నారి కీర్తన తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదించారు. కుమార్తె మృతి వార్త తెలియగానే తల్లిదండ్రులు హుటాహుటిన పాఠశాల వద్దకెళ్లారు. విఘతజీవిగా పడిఉన్న కుమార్తెను చూసి కన్నీటి పర్యవంతం అయ్యారు. కీర్తనా లేవమ్మా అంటూ వారు రోధించిన తీరు అక్కడున్న వారినందరినీ కంటతడి పెట్టించింది.
బండల షెడ్లతో పాఠశాల..!
చిన్నారి మృతికి కారణమైన పాఠశాలను పరిశీలిస్తే అక్కడ ఎలాంటి రక్షణ సదుపాయాలు లేవని ఇట్టే అర్థం అవుతుంది. బండరాళ్లపై రేకుల షెడ్డును వేసి పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇలా రక్షణ లేకుండా ఏర్పాటు చేసిన గదుల్లో పాఠాలు చెప్పేందుకు విద్యాధికారులు అనుమతులు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వేలాది రూపాయలు ఫీజులు రూపంలో తీసుకునే పాఠశాల యాజమాన్యాలు విద్యార్థుల రక్షణను గాలికొదిలేస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూతుర్ని పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులకు ఎవరు న్యాయం చేస్తారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
విద్యార్థి సంఘాల ఆందోళన
గుంతకల్లు పట్టణంలో బండల షెడ్లతో నిర్వహించే ప్రయివేటు పాఠశాలలను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు శుక్రవారం నాడు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. గుంతకల్లు పట్టణంలో గుర్తింపు లేని పాఠశాలలు నిర్వహిస్తున్నప్పటికీ స్థానిక ఎంఇఒ, జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయివేటు పాఠశాలలపై విద్యాధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్లనే గుంతకల్లులో శ్రీవిద్య ఇంగ్లీషుమీడియం పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారి కీర్తన మరణించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వారి వద్దకు పోలీసులు వచ్చి చర్చలు జరిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసి, బాధ్యులపై చర్యలు తీసుకునేంత వరకు ఆందోళన విరమించమని నాయకులు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు విద్యార్థి సంఘం నాయకులను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.










