బంగారు... 'తగ్గేదేలే'..!
10 గ్రాముల బంగారం రూ.61,750
కేజీ వెండి ధర రూ.78,700
దీపావళి వరకూ ఇంతేనా...!!
ప్రజాశక్తి-తిరుపతిటౌన్
దీపావళి అంటేనే వెలుగుల పండుగ.. బాణసంచా పేల్చి పిల్లలు కేరింతలు కొడుతుంటే, మహిళలు బంగారం కొని ఆనందపడుతుంటారు.. సహజంగా దసరా నుంచి దీపావళి వరకూ మహిళలు ఎంతోకొంత బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే ఈసారి దీపావళికి బంగారం ధర తగ్గేదేలే అనేలా ఆకాశం వైపే చూస్తోంది. పది గ్రాముల బంగారు ధర రూ.61,750 ఉంది. కేజీ వెండి ధర రూ.78,700గా ఉంది. ఏమైనా దీపావళి వరకూ ఇదే ధరలు ఉంటాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బంగారు షాపుల్లో అక్రమ నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో రాయలసీమ పరిధిలో ఐటి దాడులూ జరుగుతుండటం గమనార్హం.
దసరా రోజు ఏ కార్యం చేపట్టినా విజయోస్తు అనేలా ఉంటుందని భక్తుల నమ్మకం. అందుకే కొత్త పనులు ఏవైనా దసరా రోజు ప్రారంభిస్తారు. అలాగే మహిళలు సైతం బంగారం కొనుక్కునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే దసరా పండుగకు బంగారం కొనేందుకు వెళ్లిన మహిళలు ధరలు చూసి వెనకడుగు వేశారు. పశ్చిమాసియా దేశాల్లోని ఇజ్రాయిల్ - పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా బంగారం ధరలు కొంత పెరిగినట్లు బంగారు నగల వ్యాపారులు చెబుతున్నారు. మరికొన్ని రోజులు ఇలాగే ఉంటాయని తెలుస్తోంది. దీపావళి పండుగకు బంగారు, వెండి కొనాలని ఆశపడితే పెరిగిన ధరలతో కొనుగోలు చేయాల్సిందే. మంగళవారం నాటికి కేజీ వెండి ధర 78,700 ధర పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారు గ్రాముపై 220 రూపాయలు ధర పెరిగింది. పెరిగిన ధరతో 10 గ్రాముల బంగారం రూ.61,750గా ఉంది. 22 క్యారెట్ల బంగారం గ్రాముపై 200 పెరగడంతో పది గ్రాములు 56వేలకు చేరుకుంది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు పెట్టుకున్న వారు ప్రస్తుతం బంగారు కావాల్సినంత కొనే పరిస్థితి లేదు. ఏదో అవసరం మేరకు కొని సులభ వాయిదాలు చెల్లించుకోవాల్సిందేనని మహిళలు అంటున్నారు. మొత్తానికి బంగారు, వెండి ధరలు రెండూ పోటీపడి పరుగులు తీస్తున్నాయి. ఈ రెండే కాకుండా ప్లాటినం, వజ్రాలు, ఇతర అలంకరణ వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. కార్తీక మాసంలో పెళ్లిళ్ల సీజన్ ఉండడంతో బంగారు నగలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారని వ్యాపారులు అంటున్నారు. రాయలసీమ జిల్లాల పరిధిలో బంగారు నగల క్రయ విక్రయాలు ఈ నెలలో కొంతవరకూ తగ్గినా వచ్చే నెలలో పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.
వ్యాపారులపై నిఘా
బంగారు నగలు అమ్మే వ్యాపారులపై ఐటి అధికార్లు నిఘా పెట్టారు. ఇటీవల ఐటీ అధికార్లు రాయలసీమ జిల్లాలతో పాటు కడప జిల్లా ప్రొద్దుటూరులో దాడులు చేసి సుమారు 200కేజిల బంగారును సీజ్ చేశారు. వీరు ప్రభుత్వనికి ఎటువంటి ట్యాక్స్ చెల్లించకుండ అమ్మకాలు చేస్తున్నారని సమాచారం రావడంతో ఐటి దాడులు రాయలసీమ జిల్లాల్లో చేస్తున్నారు. తిరుపతి జిల్లాలోనూ ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించకుండా వ్యాపారులు అమ్మకాలు ఏమైనా చేస్తున్నారా? లేదా ? అని ఐటి అధికారులు నిఘా పెట్టారు. బంగారు నగల వ్యాపారులు ఐటి దాడుల సమచారం తెలుసుకుని ఆప్రమత్తంగా ఉన్నారు.










