ప్రజాశక్తి - చిలమత్తూరు : ఆర్టీసీ బస్సులు నిత్యం మొరాయిస్తూ ప్రయణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. కాలం చెల్లిన బస్సులను యథాతథంగా ఉపయోగిస్తుండటంతో ఈ సమస్య నెలకొన్నట్లు తెలుస్తోంది. కాలంచెల్లిన బస్సులు వాతావరణాన్ని కాలుష్యం చేయడంతో పాటు ఎక్కడికక్కడ మొరయిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా హిందూపురం నుండి చిలమత్తూరు కి వచ్చే బస్సు కనుమ మిట్ట, టేకులోడు క్రాస్ వద్ద మిట్టను ఎక్కలేక మొరయిస్తుంది. ఇక బస్సులో ఉన్న ప్రయాణికులు బస్సు దిగి నెట్టితే తప్ప బస్సు స్టార్ట్ అవదు. ఇది నిత్యకృత్యం అయిందని ప్రయాణికులు చెబుతున్నారు.సోమవారం టేకులోడు క్రాస్ వద్ద ఈ చిత్రం ప్రజాశక్తి కంట పడింది. డిపో అధికారులు చొరవ తీసుకొని కాలం చెల్లిన బస్సులకు స్వస్తి చెప్పాలని ప్రయాణికులు కోరుతున్నారు. టికెట్ కొని మరి బస్సును బతిమిలాడుకున్నట్లు ఉందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.










