Sep 11,2023 21:55

చంద్రబాబు రిమాండ్‌ నేపథ్యంలో చేపట్టిన బంద్‌ ప్రశాంతం
ప్రయివేటు స్కూళ్లు, పలు దుకాణాలు స్వచ్ఛందంగా మూత
కొనసాగిన టిడిపి, జనసేన ర్యాలీలు, ఆందోళనలు
యథావిధిగా తిరిగిన ఆర్‌టిసి బస్సులు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబుకు రిమాండ్‌ విధించిన నేపథ్యంలో టిడిపి పిలుపు మేరకు చేపట్టిన బంద్‌ జిల్లాలో పాక్షికంగా సాగింది. పోలీసులు ముందస్తుగా నాయకులను గృహనిర్బంధం చేయడం, అదుపులోకి తీసుకోవడంతో బంద్‌ ప్రభావం తగ్గింది. బంద్‌ నేపథ్యంలో ప్రయివేటు విద్యాసంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. ఏలూరు, జంగారెడ్డిగూడెంతోపాటు పలు ప్రాంతాల్లో వ్యాపారులే స్వచ్చందంగా దుకాణాలు మూసివేశారు. పలుచోట్ల టిడిపి నాయకులు దుకాణాలను మూయించిన ఘటనలూ ఉన్నాయి. ఏలూరులో డిఇఒ, రిజిస్ట్రార్‌, వ్యవసాయశాఖ కార్యాలయాలను సైతం టిడిపి నాయకులు మూయించారు. పోలీసులు రంగప్రవేశం చేసి టిడిపి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఆర్‌టిసి బస్సులు మాత్రం యథావిధిగా నడిచాయి. ఒకపక్క జోరు వర్షం, మరోపక్క బంద్‌ నేపథ్యంలో జనం ఇబ్బందులు పడ్డారు. ఆదివారం రాత్రే బంద్‌కు పిలుపునివ్వడంతో ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. జనసేన సైతం బంద్‌కు మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ నాయకులు రోడ్డెక్కి ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించారు. జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి రెడ్డి అప్పలనాయుడుని పోలీసులు ముందస్తుగానే గృహనిర్బంధం చేశారు. కొన్నిచోట్ల దుకాణాలు మధ్యాహ్నం నుంచి తెరుచుకున్నాయి. తణుకు పట్టణంలో ఆర్‌టిసి బస్సులను సైతం టిడిపి నాయకులు నిలుపుదల చేశారు. పట్టణంలో టిడిపి, జనసేన నాయకుల ర్యాలీలు కొనసాగాయి. భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, నరసాపురం వంటి పట్టణాల్లోనూ బంద్‌ పాక్షికంగా సాగింది. మండల కేంద్రాల్లోనూ నాయకుల ర్యాలీలు, ఆందోళనలు సాగాయి. ఎక్కడికక్కడే పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. 144 సెక్షన్‌ అమలులో ఉన్నట్లు ముందస్తుగానే ప్రకటించారు. జిల్లా ఎస్‌పి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. చంద్రబాబుకు రిమాండ్‌ విధింపు జిల్లా ప్రజానీకంలో తీవ్ర చర్చనీయాంశమైంది. చంద్రబాబుకు బెయిల్‌ వస్తుందా, లేక జైల్లోనే ఉంటారా అంటూ పెద్దఎత్తున చర్చలు సాగాయి. పలుచోట్ల ఇదే అంశంపై బెట్టింగ్‌లు సాగడం గమనార్హం.
కైకలూరులో టిడిపి, జనసేన నాయకుల అరెస్టు
కైకలూరు : మండల కేంద్రమైన కైకలూరులో బంద్‌ ఉద్రిక్తంగా మారింది. వ్యాపార సంస్థలను మూయిస్తున్న టిడిపి, జనసేన నాయకులను, కార్యకర్తలను పొలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి పూల రాజీ, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షలు కెకె.బాబు, పోలవరపు లక్ష్మీరాణి, డోకల శ్రీను, జనసేన నాయకులు బివి.రావు, కొల్లి వరప్రసాద్‌, తోట లక్ష్మీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అలాగే కైకలూరులోని టిడిపి ముఖ్యనేతలను పొలీసులు గృహనిర్బంధం చేశారు. మాజీ ఎంఎల్‌సి కమ్మిలి విఠల్‌రావు, జెడ్‌పిటిసి మాజీ సభ్యులు బొమ్మనబోయిన విజయలక్ష్మి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పూల రాజీని పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.
చింతలపూడి:పట్టణంలో శాంతియుతంగా, ప్రశాంతంగా బంద్‌సాగింది. ప్రయివేటు విద్యాసంస్థలు, వ్యాపార దుకాణాలు, పెట్రోల్‌ బంకులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఎంఆర్‌పిఎస్‌ చింతలపూడి నియోజకవర్గ నాయకులు బందుకు సంఘీభావం తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఐటిడిపి నియోజకవర్గ కన్వీనర్‌ అవినాష్‌, మండల ప్రధాన కార్యదర్శి కోండ్రు దేవ, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు నాగేంద్ర, మల్లాయిగూడెం సర్పంచి చికటి కవిత, ఎంఆర్‌పిఎస్‌ జాతీయ నాయకులు చౌటపల్లి విజరు మాదిగ, నాయకులు నక్షత్రం మాదిగ, గొల్లపల్లి సౌజన్య మాదిగ, టిడిపి ఐటిడిపి నియోజకవర్గ నత్త రవికుమార్‌, నాగభూషణం, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
నిరసన ప్రజాస్వామికు హక్కు
బంద్‌ సందర్భంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి

ఏలూరు:నిరసన అనేది రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామిక హక్కు అని, టిడిపి బంద్‌ నేపథ్యంలో ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలు దారుణమని సిపిఎం జిల్లా కమిటీ ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి తలపెట్టిన బంద్‌ సందర్భంగా జిల్లాలో టిడిపి, జనసేన నేతల అరెస్టులు సరికాదని పేర్కొన్నారు. టిడిపి, జనసేన ముఖ్యనేతలను గృహనిర్బంధంలో ఉంచడాన్ని ఖండించారు. శాంతియుత నిరసనలపై నిర్బంధం, 144 సెక్షన్‌, 30 యాక్ట్‌ అమలు అమానుషమని తెలిపారు. అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.