Sep 11,2023 21:38

సాలూరులో నిరసన తెలుపుతున్న భంజ్‌దేవ్‌ను లాక్కెళ్తున్న పోలీసులు

టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్‌ జిల్లాలో పాక్షికంగా జరిగింది. ముందస్తుగానే పోలీసులు టిడిపి నాయకులను గృహనిర్బంధం చేయడం, 144 సెక్షన్‌ విధించడం తదితర కారణాల రీత్యా ప్రశాంతంగా జరిగింది. పలుచోట్ల ఆందోళనలు చేయగా, నాయకులను అరెస్టు చేశారు.

ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ : 
పార్వతీపురంలో సోమవారం వేకువ జాము నుంచి పెద్ద ఎత్తున పోలీసులు, రిజర్వు పోలీసులు ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకొని భారీ బందోబస్తు మధ్య బస్సులు నడిచే ఏర్పాట్లు చేశారు. అనంతరం పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో టిడిపి కార్యకర్తలు ఆర్‌టిసి కాంప్లెక్స్‌ కూడలిలో ఘోరావ్‌ చేయగా, వారి అందరినీ అరెస్టు చేసి, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించి 16 మందిని అరెస్టు చూపారు. అనంతరం పార్వతీపురం ప్రధాన రహదారిపై కార్యకర్తలతో కలిసి నిరసన తెలియజేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌తో పాటు ఇతర నాయకులను అదుపులోకి తీసుకుని పార్టీ కార్యాలయానికి తరలించి వారిని నిర్బంధించారు. మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు తన అనుచరులు, కార్యకర్తలు, టిడిపి అభిమానులతో కలిసి ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో నిరసనకు దిగగా వారిని కూడా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఏది ఏమైనప్పటికీ జిల్లా కేంద్రంలో టిడిపి నిర్వహించాల్సిన బంద్‌ను పోలీసులు భగం చేశారు. కార్యక్రమంలో సిఐ కృష్ణారావు, పట్టణ రూరల్‌ ఎస్సైలు దినకర్‌, సింహాచలం, ఎఎస్‌ఐ శ్యామ్‌ కుమార్‌ పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును వెంటనే విడుదల చేయాలని కురుపాం నియోజకవర్గం ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎల్విన్‌ పేట నుంచి గుమ్మలక్ష్మీపురం వరకు ర్యాలీ నిర్వహించారు. సిఎం డౌన్‌ డౌన్‌, వురు వాంట్‌ జస్టిస్‌, చంద్రబాబును వెంటనే విడుదల చేయాలి అంటూ నినాదాలు చేశారు. టిడిపి బంద్‌కు పిలుపునివ్వడంతో గుమ్మలక్ష్మీపురం, ఎల్విన్‌పేట గ్రామాల్లో షాపులు మూతపడ్డాయి. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణంలో టిడిపి నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ మేరకు పోలీసులు ఇంచార్జి జగదీశ్వరితో పాటు మండల కార్యదర్శి పోలూరు శ్రీనివాసరావు, నాయకులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు సొంటేన రాజేష్‌, అడ్డాకుల నరేష్‌, జానకి తదితరులు ఉన్నారు.
కురుపాం : చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ స్థానిక బస్‌ స్టాండ్‌ వద్ద టిడిపి జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్‌ దత్తి లక్ష్మణరావు ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు నల్ల కండువాలు ధరించి నిరసన చేపట్టారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ కెవి కొండయ్య, టిడిపి నాయకులు పద్మావతి, లావణ్య, సువ్వాన గోవిందరావు, చందక రామకష్ణ, రవణమూర్తి, సుకేష్‌ చంద్రపండా తదితరులు పాల్గొన్నారు.
గరుగుబిల్లి : చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ యర్రన్న గుడి జంక్షన్‌ వద్ద టిడిపి శ్రేణులు బంద్‌ పాటించాయి. రావివలస జంక్షన్‌ వద్ద బంద్‌ నిర్వహించారు. కార్యక్రమంలో కోట భరత్‌, ఆర్నెపల్లి గంగాధర్‌ నాయుడు, గొర్లి కిషోర్‌, గంట సేతం నాయుడు, భానుమూర్తి, సత్యనారాయణ గారు పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సీతానగరం : స్థానిక హనుమాన్‌ జంక్షన్‌ నుంచి బజార్‌ వరకు టిడిపి ర్యాలీ నిర్వహించింది. బ్యాంకులో దుకాణాలు మూతపడ్డాయి. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్ష కార్యదర్శులు కొల్లి తిరుపతిరావు, రౌతు వేణుగోపాల్‌ నాయుడు, ఎస్‌.హరిగోపాలరావు, బి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ, ఎస్‌ శ్రీనివాసరావు, బి.వెంకటనాయుడు, బి.ఫకీరునాయుడు, ఆర్‌.సింహాచలం, పి.ఉమామహేశ్వరరావుతో పాటు పలు గ్రామాలకు చెందిన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. జొన్నాడ కేరేజమ్మ, గరికయ్య, ఎస్‌.సత్యనారాయణ, పి.సత్యనారాయణ, బి.లక్ష్మణరావు, తిరుపతిరావు పాల్గొన్నారు
సాలూరు: మాజీ సిఎం చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌ దేవ్‌ ఆధ్వర్యాన టిడిపి నాయకులు కార్యకర్తలు వెంకటేశ్వరా డీలక్స్‌ సెంటర్‌లో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యాన పోలీసులు అక్కడకు చేరుకుని సెక్షన్‌ 30 అమల్లో ఉన్న కారణంగా సామూహిక నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేయరాదని చెప్పారు. ఆందోళనకారులను రోడ్డుపై నుంచి లాక్కుని వెళ్లారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు ఎ.పరమేష్‌,మాజీ అధ్యక్షులు చోడవరపు గోవింద రావు, పట్టణ నాయకులు కొనిసి చిన్ని,పప్పల మోహనరావు పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గ ఇన్చార్జి సంధ్యారాణి ఆధ్వర్యాన టిడిపి నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని, సిఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు,మాజీ కౌన్సిలర్‌ అప్పయ్యమ్మ పాల్గొన్నారు.
కొమరాడ : మండలంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆయా గ్రామాల్లో ఉన్న దుకాణాలు, పాఠశాలలను మూసివేసి బంద్‌కు సహకరించాలని కోరుతూ ముగించారు. అరకు పార్లమెంటరీ టిడిపి ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి బిడ్డిక తమ్మయ్య ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర రహదారిపై నిరసన తెలిపి ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీసులు వారిని అడ్డుకున్నారు. కార్యక్రమంలో నాయకులు ఎం.వెంకటనాయుడు, ఎం.శశిభూషణరావు, కె.అచ్చుతారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చంద్రబాబు బయటకు వచ్చేవరకు రిలే నిరాహార దీక్షలు
చంద్రబాబునాయుడు జైలు నుంచి బయటకు వచ్చేవరకూ రిలే నిరాహార దీక్షలు చేపడతామని టిడిపి అరకు పార్లమెంట్‌ ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి బిడ్డికి తమ్మయ్య తెలిపారు. మంగళవారం నుంచి మండల కేంద్రంలో రిలే దీక్షలు చేపడతానని దీనికి అనుమతులు మంజూరు చేయాలని ఎస్‌ఐ జగదీష్‌నాయుడుకు కు వినతిపత్రం అందజేశారు. మండలంలోని కార్యకర్తలు, నాయకులు రిలే నిరాహార దీక్షలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
మక్కువ : చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ మండల టిడిపి పార్టీ నిరసన చేపట్టింది. ఆ పార్టీ నాయకులు మావుడి ప్రసాదరావు నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నిరసనను పోలీసులు అడ్డుకొని ప్రసాద్‌నాయుడును హౌస్‌ అరెస్ట్‌ చేశారు కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బి.గౌరీశంకర్రావు, నాయకులు పాల్గొన్నారు.
వీరఘట్టం : చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా స్థానిక అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద రోడ్డుపై టిడిపి నాయకులు బైఠాయించారు. కార్యక్రమంలో నియోజకవర్గ బాధ్యులు నిమ్మక జయకష్ణ, మండల అధ్యక్షులు ఉదయాన ఉదయభాస్కర్‌, బల్ల హరిబాబు, నాయకులు పరిచర్ల వెంకటరమణ, మాచర్ల అనిల్‌, ఎన్‌.శశికుమార్‌, ఉమామహేశ్వరరావు, కృష్ణ, ఎ.కుమారస్వామి, బి.నీలకంఠం నాయుడు, కె.జనార్ధనరావు, తాతబాబు, కార్యకర్తలు ,అభిమానులు, పాల్గొన్నారు.
టిడిపి నాయకుల అరెస్టు అక్రమం
సాలూరు: చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా శాంతియుతంగా నిరసన ర్యాలీ, ఆందోళన చేస్తున్న టిడిపి నాయకులను అరెస్టు చేయడం అక్రమమని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అన్నారు. సోమవారం పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ వుందని, అలాంటి సందర్భంలో టిడిపి నాయకులను గృహ నిర్బంధంలో ఉంచడం, అరెస్టు చేయడం సరికాదని అన్నారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఎన్వైనాయుడు, మండల కార్యదర్శిలు ఎం.శ్రీనివాసరావు, కోరాడ ఈశ్వరరావు పాల్గొన్నారు.

చంద్రబాబు అరెస్టు అనైతికం : ఆర్‌పిఐ
సాలూరు : చంద్రబాబు నాయుడును అనైతిక పద్దతిలో అరెస్టు చేయడం సరికాదని రిపబ్లికన్‌ పార్టీ నాయకులు గొంప ప్రకాశరావు అన్నారు. సోమవారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం హయాంలో అరాచకాలు, భూకబ్జాలు హద్దు మీరుతున్నాయని అన్నారు. అక్రమాలను ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కాలని వైసిపి ప్రభుత్వం చూస్తోందన్నారు. ఈ విధానాలు మార్చుకోకపోతే ప్రజలు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని గొంప ప్రకాశరావు ఆ ప్రకటనలో హెచ్చరించారు.