ప్రజాశక్తి-కర్నూలు కల్చరల్ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక సెప్టెంబర్ 24వ తేదిన ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నారీ సాహిత్య భేరీ", అంతర్జాతీయ శతాధిక కవయిత్రుల సమ్మేళనం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత్రి డా బల్లూరి ఉమాదేవిని ప్రత్యేక అతిథిగా తానా సంస్థ వారు ఆహ్వానించారు. తానా వారు నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో కవిత్వం వినిపించటానికి తనకు విశిష్టమైన స్థానాన్ని కల్పించినందుకు తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు గారికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ లకు ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. 14 గంటల పాటు నిర్విరామంగా జరిగే సాహిత్య సమ్మేళనంలో భారత్ తో పాటు విశ్వ వ్యాప్తంగా సుమారు 15 దేశాలకు చెందిన ప్రముఖ తెలుగు కవయిత్రులు, రచయిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ప్రజాశక్తితో అన్నారు. వీరితో పాటు ప్రముఖ మహిళలు పాల్గొంటారని అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాల వేదికగా జరిగే ఈ కార్యక్రమం 10కి పైగా మాధ్యమాలలో ప్రత్యేక్ష ప్రసారం చేస్తారన్నారు. యాప్ టీవీ ద్వారా యూరోపియన్ దేశాలు, అమెరికా వంటి దేశాల్లో, ఈ టీవీ భారత్, మన టీవీ, తెలుగు వన్, తానా అధికారిక యుట్యూబ్ ఫేస్బుక్ చానెల్ వంటి చానెల్ లలో ప్రత్యక్ష ప్రసారం వస్తుందన్నారు. ఇటువంటి ప్రత్యేక కార్యక్రమంలో తమను ఎంపిక చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. డా.ఉమాదేవి కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తెలుగు శాఖాధ్యక్షులుగా పనిచేసి 2012లో పదవీ విరమణ చేశారు.










