బిల్లుల షాక్..!
- భారీగా పెరిగిన విద్యుత్ బిల్లులు
- ఒక నెలలోనే సామాన్యులపై రూ.2.31 కోట్ల భారం
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి
''బేతంచర్లకు చెందిన నబిరసూల్ గత నెల లాగానే ఈ నెల కూడా విద్యుత్‌ను వినియోగించారు. గత నెల రూ.494 విద్యుత్ బిల్ వచ్చింది. అది ఈ నెలకు రూ.878కి పెరిగింది. అంటే దాదాపు రెట్టింపయింది.'' ఇలా ఆయనొక్కరికే కాదు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా అందరికీ విద్యుత్ బిల్ భారీగా పెరిగింది. ట్రూఅప్ పేరుతో ప్రభుత్వం అదనపు బాదుడు వేయడమే అందుకు ప్రధాన కారణం...
సామాన్యులకు ఈ నెలలో విద్యుత్ బిల్లులు ముట్టుకోవాలంటేనే షాక్ కొడుతోంది. గత ఏడాది ఆగష్టు నుంచే తొలి విడత ట్రూఅప్ ఛార్జీలను వసూలు చేస్తుండగా ఈ నెల నుంచి రెండో విడత ట్రూఅప్ ఛార్జీలను వసూలు చేస్తుండటంతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 11,19,459 గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఆ కనెక్షన్ల వినియోగదారులందరూ కలిసి మే నెలలో 10.04 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు వాడుకున్న విద్యుత్ వినియోగాన్ని 18 ఇన్‌స్టాల్‌మెంట్స్‌గా తీసి ట్రూ అప్ చార్జీలు యూనిట్‌కు అప్పట్లో వినియోగించిన యూనిట్‌కు ఏడు పైసల చొప్పున వసూలు చేస్తున్నారని విద్యుత్ శాఖ చెబుతోంది. 2021-2022 సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్‌లో వాడుకున్న వినియోగా కి సంబంధించి అప్పట్లో వాడుకున్న వినియోగానికి యూనిట్‌కు 23 పైసలు చొప్పున ట్రూఅప్ భారం విధించారు. ఆ నెలకు సంబంధించిన విద్యుత్ బిల్లు జూన్ నెలలో వచ్చింది. అందులో సామాన్యులపై పెంపు భారం పడింది. అంటే 100 యూనిట్లు వినియోగించిన వినియోగదారులకు రూ.23 చొప్పున, 200 యూనిట్లు వాడిన వారికి రూ.46, 300 నుంచి 400 యూనిట్లు వాడిన వారికి రూ.69 నుంచి రూ.92 మేర ట్రూఅప్ రూపంలో పెరిగింది. ఇలా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరి మీద ఒక్క నెలలోనే రూ.2.31 కోట్ల మేర ట్రూ అప్ భారం పడింది.
ఎఫ్‌పిపిసిఎ రూపంలో రూ.6.32 కోట్లు
ప్యూయల్ అండ్ పవర్ పర్చేజి కాస్ట్ అడ్జస్ట్‌మెంట్(ఎఫ్‌పిపిసిఎ) రూపంలోనూ రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులపై తీవ్ర భారం మోపింది. 2023 ఏప్రిల్‌లో వినియోగించుకున్న వినియోగానికి యూనిట్‌కు 40 పైసలు చొప్పునకింద అదనపు చార్జీలు జూన్‌లో వసూలు చేస్తున్నారు. ఇవి విద్యుత్ వినియోగదారుడికి అదనపు భారంగా మారింది. ఇలా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న గృహ వినియోగదారులపై ఎఫ్‌పిసిసిఎ రూపంలో ఈ ఒక్క నెలలోనే రూ.6.32 కోట్ల మేర భారం పడింది. వినియోగదారులపై ట్రూఅప్‌తో పాటు ఎఫ్‌పిసిసిఎ రూపాల్లో భారం వేయడంతో యూనిట్‌కు 63 పైసల చొప్పున భారం పడింది. గతంలో నెలకు రూ.150 నుంచి రూ.300 వచ్చే వారికి రూ.250 నుంచి రూ.600 వరకు విద్యుత్ బిల్లులు వచ్చాయి. రూ.400 నుంచి రూ.600 వచ్చే వారికి రూ.600 నుంచి రూ.800, రూ.600 నుంచి రూ.800 బిల్లు వచ్చే వారికి రూ.850 నుంచి రూ.1100 వరకూ ఈ నెల విద్యుత్ బిల్లులు వచ్చాయి.
భారంగా పెరిగిన బిల్లులు
నా భర్త పాలిష్ బండల ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ఆయనకు వచ్చే జీతంతో కుటుంబం గడుస్తోంది. గత నెలకు, ఈ నెలకు భారీగా విద్యుత్ బిల్లులు పెరిగాయి. అది భారంగా మారింది. గత నెల రూ.494 బిల్లు వస్తే ఈ నెల రూ.878 వచ్చింది. అంతంత బిల్లులు వస్తే ఎలా కట్టాలి.
- ఎస్.రెహానా, బేతంచర్ల.










