ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : ప్రజా వ్యతిరేక, నిరంకుశ మతోన్మాద బిజెపిని సాగనంపి, దేశాన్ని కాపాడు కొందామని సిపిఎం నాయకులు బ్యాళ్ళ అంజి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని కర్నాటక నాగేపల్లికి వెళ్లే రహదారిలో ప్రచార భేరి గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది ఏళ్ల బిజెపి పాలనలో ప్రధాని మోడీ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారే తప్ప రైతులకు కార్మికులకు చేసిందేమీ లేదన్నారు. కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తూ కార్మిక కర్షక, చిన్న వ్యాపారులు ఇతర పేద వర్గాలకు మొండి చేయి చూపుతున్నారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడమే గాక నిరంకుశ పాలన చేస్తూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారన్నారు. అందుకే ఈవిషయాలన్నింటి పైన ఈనెల 14 నుంచి 30 వరకు ప్రచారభేరీ ద్వారా ప్రజలను చైతన్య పరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తిరుపాలప్ప, పెద్ద తిరుపాల్, సన్నోడు తదితరులు పాల్గొన్నారు.










