Sep 27,2023 22:03

పత్తి పంటను పరిశీలిస్తున్న ఎఒ తిరుపతిరావు

ప్రజాశక్తి-పాచిపెంట : అంతర పంటలు, కంచి పంటల ద్వారా అదనపు ఆదాయాన్ని పొందడమే కాకుండా పంటకు రక్షణ కవచంగా ఉపయోగపడతాయని మండల వ్యవసాయ అధికారి కె.తిరుపతిరావు తెలిపారు. బహుళ పంటలు ద్వారా జీవవైవిధ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. మండలంలో విశ్వనాథపురం, పాంచాలి, రాయిగుడ్డివలస గ్రామాల్లో అమలవుతున్న అంతర పంటలు, ప్రకృతి సేద్య పద్ధతులను బుధవారం ఆయన పరిశీలించారు వ్యవసాయ శాఖ ద్వారా ఉచితంగా అందించిన కంది విత్తనాలు, ఎపిసిఎన్‌ఎఫ్‌ అందజేసిన కూరగాయల విత్తనాలను పత్తిలో అంతర పంటలుగా, వరి పొలంలో గట్లపై కంచె పంటలుగా వేసుకోవచ్చని తెలిపారు. దీనివల్ల మిత్ర పురుగులను ఆకర్షించి శత్రువులను అరికట్టడమే కాకుండా, అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చని తెలిపారు. అనంతరం విశ్వనాథపురంలో తెర్లంగి ధనుంజయ అనే రైతు ప్రయోగాత్మకంగా జంటసాలు పద్ధతిలో సాగు చేస్తున్న వరి పంటను పరిశీలించారు. పత్తి, వరి పంటలో దోమపోటు నివారణకు ఉపయోగపడే జిగురు అట్టలను ప్రకృతి సేద్య బృందం ద్వారా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్‌పి తిరుపతి నాయుడు, ఐసిఆర్‌పి విజరు, ఎఇఒ హైమ, విఎఎ మోహన్‌, రైతులు పాల్గొన్నారు.