Oct 02,2023 20:46

బలిజిపేట: పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పాటు చేసిన స్టీల్‌ ప్లాంట్‌ రక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సిపిఎం మండల కార్యదర్శి కోలక అవినాష్‌ పిలుపునిచ్చారు. స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం ఆపాలని అక్టోబర్‌ 5న విశాఖపట్నంలోని స్టీల్‌ ప్లాంట్‌ ఆర్చ్‌ కూర్మన్నపాలెంలో నిర్వహించబోయే బహిరంగ సభ ను జయప్రదం చేయాలని కోరుతూ గుమ్మలక్ష్మీపురంలో సిపిఎం నాయకులు సోమవారం గోడ పత్రికలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవినాష్‌ మాట్లాడుతూ ఎంతో మంది ప్రజల త్యాగాలతో సాధించుకున్న స్టీల్‌ ప్లాంట్‌ను కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్‌ వ్యక్తులకు అమ్మడానికి సిద్ధపడిందన్నారు. దీన్ని ముక్తకంఠంతో తిప్పి కొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మండంగి రమణ, సిఐటియు మండల కార్యదర్శి కే గౌరీశ్వరరావు, సిపిఎం మండల నాయకులు ఎం సన్యాసిరావు, పువ్వుల మోహన్‌ రావు, పాండు రంగారావు, ఎం నూకయ్య తదితరులు పాల్గొన్నారు.
మక్కువ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వం కార్పొరేట్లకు అమ్మ చూపుతున్న వ్యవహారాన్ని ప్రజలంతా ఏకమై వ్యతిరేకించాలని ఐద్వా నాయకులు వి.ఇందిరా పిలుపునిచ్చారు. మండలంలోని వెంకట భైరిపురం గ్రామంలో పోస్టర్‌ విడుదల చేశారు. ఈనెల 5న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ గేట్‌ వద్ద జరిగే భారీ బహిరంగ సభకు ప్రజలంతా తరలిరావాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు తాడంగ ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
బలిజిపేట: ఈ నెలి 5న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ గేట్‌ కూర్మన్నపాలెంలో జరగనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మన్మధరావు కోరారు. మండల కేంద్రంలో సోమవారం గాంధీ జయంతి సందర్భంగా గాంధీ బొమ్మ దగ్గర నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు.
కొమరాడ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌తో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం జరగకుండా ఆపే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను విరమించుకునే విధంగా ఆలోచింపచేయాలని కోరుతూ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మహాత్మ గాంధీ చిత్రపటానికి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్‌ఐసి, బిఎస్‌ఎన్‌ఎల్‌, రైల్వే బ్యాంకులు, ఎయిర్‌ ఫోర్స్‌తో పాటు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటుపరం ఆపాలని డిమాండ్‌ చేశారు.
సాలూరు రూరల్‌ : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ ఈనెల 5న జరగనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని మండలంలోని బట్టివలస, జిల్లేడువలసలో సిపిఎం మండల కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు, సభ్యులు గేమ్మెల జానకి రావు ఆవిష్కరించారు. ఈ బహిరంగ సభలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొంటారని, కావున ఈ బహిరంగ సభను ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు వంతల శివ, మర్రి మసి, వంతల చిన్న తదితరులు పాల్గొన్నారు.