Jul 24,2023 19:04

బెల్ట్‌ షాపుల నిర్వాహకులతో మాట్లాడుతున్న ఎస్‌ఐ

ప్రజాశక్తి - చిప్పగిరి
మండలంలోని అన్ని గ్రామాల్లో బెల్ట్‌ షాపులు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకొని కేసు నమోదు చేస్తామని, గతంలో నిర్వహించిన బెల్ట్‌ షాపుల నిర్వాహకులను ఎస్‌ఐ రమేష్‌ బాబు హెచ్చరించారు. సోమవారం పోలీసు స్టేషన్‌లో గతంలో నిర్వహించిన బెల్ట్‌ షాపుల నిర్వాహకులను పిలిపించి అవగాహన కల్పిస్తూనే వారిని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడారు. గ్రామాల్లో అనధికారికంగా బెల్ట్‌ షాపులు నిర్వహించినట్లు తమ దృష్టికి వచ్చినా లేదా గోప్యంగా ఎవరైనా సమాచారం ఇచ్చినా ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని తెలిపారు. స్టేషన్‌కు తీసుకొచ్చి తగిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు : మొహర్రం ఉత్సవాల సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. ప్రజలకు కూడా అవగాహన కల్పించి ఉత్సవాల్లో ఎవరైనా తాగి అల్లర్లు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మొహర్రం ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.