Apr 11,2023 21:57

పూలే చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌

         పుట్టపర్తి అర్బన్‌ : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిజ్యోతిరావు పూలే అని అధికారులు ప్రజాప్రతినిధులు తెలిపారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే 197వ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా మంగళవారం నాడు ఘనంగా నిర్వహించారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను స్పందన హాల్లో నిర్వహించారు. పూలే చిత్రపటానికి జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్‌ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సమస్యలను ఎదుర్కొని, వాటిని ప్రశ్నించారన్నారు. అణగారిన సామాజిక వర్గాల విద్యావ్యాప్తికి పాఠశాలలు ప్రారంభించిన మహోన్నత వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అన్నారు. స్త్రీలకు విద్య నేర్పించడం, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం వంటి ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. కులం పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా అణచివేతకు, వివక్షకు గురైన బడుగు, బలహీన వర్గాల్లో ఆత్మస్థైర్యం కల్పించి వారిని ముందుకు నడిపిన మహనీయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ కొండయ్య, బీసీ సంక్షేమ అధికారి, నిర్మలాజ్యోతి, సోషల్‌ వెల్ఫేర్‌ డిడి శివ రంగ ప్రసాద్‌, ఆర్డీవో భాగ్యరేఖ, పుట్టపర్తి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఓబుల పతి, వైస్‌ఛైర్మన్‌ తిప్పన్న, పూడా ఛైర్మన్‌ లక్ష్మినరసమ్మ, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ ఎ.రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.