ప్రజాశక్తి - బెలగాం : విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సిపిఎం తలపెట్టిన ఉత్తరాంధ్ర బైక్ యాత్ర జిల్లాలో ఈనెల 23, 24తేదీల్లో పర్యటించనుందని, ఈ సందర్భంగా జరిగే సభల్లో ప్రజలంతా పాల్గొనాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు కోరారు. ఈ మేరకు పట్టణంలోని వేదాంత, సాయిరాం, భాస్కర, ప్రభుత్వ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీల్లోనూ, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కరపత్రాలు పంపిణీ, ప్రచారం చేపట్టారు. అనంతరం వేణు మాట్లాడుతూ ఉత్తరాంధ్రా అభివృద్ధికి, ఈ ప్రాంతం ఉపాధికి ఉపయోగపడే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మకానికి బిజెపి పెడితే కార్మిక ప్రజాసంఘాలు, వామపక్షాలు పోరాడుతున్నాయన్నారు. ఉక్కు పరిరక్షణ కోరుతూ 800 రోజులకు పైగా పోరాటం జరుగుతోందని, దీనికి మద్దతుగా పాంట్ పరిరక్షణ కోసం 6 జిల్లాలో బైక్ యాత్ర సెప్టెంబరు 20-29 వరకు జరుగుతుందన్నారు. జిల్లాలో ఈనెల 23న 4గంటలకు పాలకొండ, 24న కురుపాంలో 9గంటలకు పార్వతీపురం, 12గంటలకు సాలూరులో 3గంటలకు బైకు యాత్ర జరుగుతుందని, ఈ సభలకు ప్రజలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జి.వెంకటరమణ, పట్టణ నాయకులు బంకురు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
సీతానగరం : విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేయకుండా ఆపాలని కోరుతూ ఈనెల పార్వతీపురంలో బైక్ ర్యాలీ బహిరంగ సభ జరుగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు తెలిపారు. బుధవారం జరిగిన పార్టీ మండల సమావేశం ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివద్ధి కోసం బైక్ ర్యాలీలు నిర్వహించి ప్రజలు మద్దతు కూడ గట్టాలన్నారు. ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రెడ్డి లక్ష్ము నాయుడు మండల కమిటీ నాయకులు రెడ్డి ఈశ్వరరావు, జివి రమణ, తదితరులు పాల్గొన్నారు.
బలిజిపేట : స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో సిపిఎం బైక్ యాత్ర పోస్టర్‌ను సిపిఎం నాయకులు వై.మన్మధరావు, గేదెల సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈనెల 23న సాయంత్రం ఐదు గంటలకు పాలకొండ, 24న కురుపాం, పార్వతీపురం, సాలూరులో ఉక్కు రక్షణ బైక్ యాత్ర రానుందని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు నల్ల ఈశ్వరరావు, బాదిలి జగన్నాథం, రామారావు, సత్యం తదితరులు పాల్గొన్నారు.
వీరఘట్టం : ఈనెల 23న పాలకొండలో నిర్వహించనున్న ఉక్కు రక్షణ బైక్ యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు ఎన్.సింహాచలం, ఎన్.ప్రసాదరావు, వై.ప్రసాదరావుతో పాటు తదితరలు పాల్గొన్నారు.










