Oct 16,2023 20:06

సమావేశంలో మాట్లాడుతున్న విక్టర్‌ ప్రసాద్‌

ప్రజాశక్తి - కౌతాళం
దళితుల్లో విద్యతో బానిస బతుకులను మార్చుదామని ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ మారుమూడి విక్టర్‌ ప్రసాద్‌ తెలిపారు. సోమవారం మండలంలోని కామవరం గ్రామంలో డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. డాక్టర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగ హక్కులను పోరాడి సాధించుకోవాలని కోరారు. రాజ్యాంగ హక్కులు పొందాలంటే దళితులందరూ విద్యావంతులు కావాలని తెలిపారు. రాష్ట్రంలో దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. కామవరంలో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి అంబేద్కర్‌ విగ్రహం పక్కన ఆయన సతీమణి విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అంతకుముందు అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వైసిపి రాష్ట్ర యువజన నాయకులు వై.ప్రదీప్‌ రెడ్డి, వీర సేనా రెడ్డి, మహీంద్రరెడ్డి, కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్‌డి.ఆనంద్‌ బాబు, ఆల్ఫ్రెడ్‌ రాజు, జానయ్య, కౌతాళం సర్పంచి పాల్‌ దినకరన్‌, జైభీం నాయకులు అవతారం, కామవరం సర్పంచి వసంత్‌ కుమార్‌ పాల్గొన్నారు.