ప్రజాశక్తి-హిందూపురం సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమా ఘూటింగ్‌ల నుంచి బయటకు వచ్చి వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూస్తే అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుందని మున్సిపల్ ఛైర్‌పర్సన్ డిఎన్ ఇంద్రజ సూచించారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్సీ షేక్ మొహమ్మద్ ఇక్బాల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు హిందూపురం మున్సిపాలిటీకి ఒక్క రూపాయి కూడా నిధులను కేటాయించని బాలయ్య రాష్ట్రస్థాయి బడ్జెట్ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రూ.2.79 లక్షల కోట్లు బడ్జెట్ ఉంటే రూ.17లక్షల కోట్లు అని చెప్పడంతోనే ఆయనకు బడ్జెట్‌పై ఉన్న అవగాహన అర్థం అవుతుందన్నారు. ప్రజారంజక పాలన అందిస్తూ దేశంలోనే అందరికీ ఆదర్శంగా నిలుస్తూ, సంక్షేమ పాలన అందిస్తున్న సిఎం జగన్‌ను విమర్శించే స్థాయి, నైతిక అర్హత కనీస రాజకీయ పరిజ్ఞానం లేని మీకు లేదన్నారు. ఇకపోతే రాష్ట్రంలో సైకో ఎవరో ప్రతి ఒక్కరికీ తెలుసు అన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసం మురుగు నీటి వ్యవస్థను కూడా బాగు చేయలేదని గుర్తు చేశారు. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా హిందూపురం ప్రజల దాహార్తిని తీర్చడానికి కోసం రూ.650 కోట్లతో పిఎబిఆర్ నీటి పథకాన్ని తీసుకొచ్చారన్నారు. ఆ పథకాన్ని పట్టించుకోకపోగా కేవలం కమీషన్లకు కక్కుర్తి పడి జల కేటాయింపులు లేని గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి రూ.194 కోట్లు వెచ్చించి వీటిని తీసుకొచ్చారన్నారు. మీరు చేసిన పాపానికి పురపాలక సంఘం రూ.63 లక్షలు ప్రతినెలా కట్టాల్సి వస్తోందన్నారు. 1983 నుంచి ఇప్పటి వరకు మీ కుటుంబానికి పట్టం కడుతుంటే హిందూపురానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు సెల్ఫీలు తీసుకోవాలకుంటే మీ అల్లుడు చేపట్టిన పాదయాత్రలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్‌ల వద్ద నిలబడి సెల్ఫీలు తీసుకోవాలని సూచించారు. ఇంకా సమయం ఉంటే రైతు భరోసా, ఇన్‌పుట్ సబ్సిడీ, జలకళ, విత్తనాల పంపిణీ, ఆసరా, అమ్మఒడి, విద్యాదీవెన, విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, చేయూత, వాహనమిత్ర వంటి పథకాలను తీసుకుంటున్న లబ్ధిదారులను కలిస్తే అభివృద్ధి ఏంటో చెబుతారని సూచించారు. ఈ సమావేశంలో వైసిపి నాయకులు పురుషోత్తంరెడ్డి, కౌన్సిలర్లు నాగేంద్రబాబు, రోషన్‌అలీ, ఆయూబ్, మణి, రహమ్మత్‌బీ, మల్లికా బాను, తదితరులు పాల్గొన్నారు.
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మున్సిపల్ చైర్‌పర్సన్ డిఎన్ ఇంద్రజ










