ప్రజాశక్తి-పొదిలి: బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని సిడిపిఒ సుధామారుతి అన్నారు. సోమవారం స్థానిక పెద్దబస్టాండ్ సెంటర్‌లో బాల్యవివాహాల నిరోధంపై మానవహారం నిర్వహించి అవగాహనపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యవివాహాల వల్ల చిన్నవయసులో మహిళలలో అనేక అనారోగ్య, శారీరక, మానసిక సమస్యలు వస్తాయన్నారు. కుటుంబం, పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు బాల్య వివాహాలను నిషేధించడమైందన్నారు. అలా కాదని బాల్యవివాహాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్యవివాహల వలన వచ్చే నష్టాలు ఇబ్బందులను ప్రజలకు వివరించారు. ప్రతి గ్రామాలలో బాల్యవివాహలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. బాల్య వివాహాలపై తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సచివాలయం మహిళ పోలీస్ సిబ్బంది అంగన్‌వాడీలు పాల్గొన్నారు.
సిఎస్ పురంరూరల్: బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని సిఎస్ పురం పంచాయతీ కార్యదర్శులు రాంప్రసాద్, వాణి అన్నారు. సిఎస్ పురంలోని ఎస్టీ కాలనీలో సోమవారం బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నతనంలో వివాహాలు చేయడం ద్వారా కలిగే అనర్ధాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు రాంప్రసాద్, వాణి, ఐసిడిఎస్ సెక్టార్ సూపర్‌వైజర్ రజని, అంగన్‌వాడీ కార్యకర్తలు నారాయణమ్మ, మాధవి పాల్గొన్నారు.
కొనకనమిట్ల: బాల్య వివాహాలను అరికట్టాలని కోరుతూ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ సుధామారుతి మాట్లాడుతూ చిన్న వయస్సులోనే వివాహాలు చేయడం వలన కలిగే ప్రమాదాల గురించి వివరించారు. గ్రామాల్లో ఎక్కడైనా బాల్యవివాహాలు చేసినట్లయితే తమ దృష్టికి తీసుకొని రావాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు సరిత, ప్రసన్న, సావిత్రి, అంగన్‌వాడీ కార్యకర్తలు, నాగమణి, వెంకటమ్మ, విజయకుమారి, సునీత, ఎఎన్‌ఎం భాగ్యలక్ష్మి, సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఆశా కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.










