ప్రజాశక్తి-శింగనమల బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ పీడీ బిఎన్.శ్రీదేవి పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని ఎంపిడిఒ కార్యాలయంలో డిసిపిఒ సుబ్రమణ్యం, ఛైల్డ్ హెల్ప్‌లైన్ 1098 జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ కృష్ణమాచారి ఆధ్వర్యంలో బాల్య వివాహ నిరోధక అధికారాలు, విధులపై డివిజినల్ స్థాయి ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలను నిరోధించడంలో ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ముఖ్యంగా గ్రామస్థాయిలో విఆర్‌ఒ, పంచాయతీ కార్యదర్శులు, మహిళా పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. వీరందరూ గ్రామాల్లో బాల్యవివాహాలు చేయడం వల్ల కలిగే అనార్థలను ప్రజలకు వివరించాలన్నారు. అనంతరం బాల్యవివాహాల నిషేధ చట్టం-2006 గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసి ఛైర్‌పర్సన్ రామలక్ష్మి, సిడిపిఒ ఉమా శంకరమ్మ, శింగనమల ఎంపిడిఒ నిర్మలాకుమారి, గార్లదిన్నె ఎంపిడిఒ తేజోష్ణ, డిఎంఅండ్‌హెచ్‌ఒ కార్యాలయ డెమోలు త్యాగరాజు గంగాధర్, ఐసిడిఎస్ సిడిపిఒలు సూపర్‌వైజర్లు, అధికారులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న మహిళా, శిశు సంక్షేమ శాఖ పీడీ బిఎన్.శ్రీదేవి










