ప్రజాశక్తి-పెద్దవడుగూరు బాల్యవివాహాలను కట్టడి చేయడం ద్వారానే మాతాశిశుమరణాలను తగ్గించవచ్చని స్త్రీశిశుసంక్షేమశాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవి సూచించారు. శుక్రవారం స్థానిక జేసీ దివాకర్ కళ్యాణ మండపంలో ఐసిడిఎస్, జిల్లా బాలల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో డివిజినల్ స్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వివాహాలు చేస్తే రెండేళ్లపాటు జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధించడంతోపాటు తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. సచివాలయ పరిధిలో మహిళా పోలీసుల సహాకారంతో పెళ్లిళ్ల వివరాలను నమోదు చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. గుత్తి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ సచివాలయ పరిధిలో ఉన్న వలంటీర్లు తన పరిధిలోని పెళ్లిళ్ల సమాచారంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వారి పరిధిల్లో బాల్యవివాహాలు జరిగితే వలంటీర్లపై కూడా కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా బాలల పరిరక్షణ సమితి అధికారి సుబ్రమణ్యం, చైల్డ్‌లైన్ ప్రాజెక్టు సమన్వయకర్త కృష్ణమాచారి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బాల్యవివాహాలు నిరోధించడానికి కొత్తగా జీవోలు, ఆన్‌లైన్ సేఫ్టీ సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా, మత్తుపదార్థాల వినియోగం, బాలల భవిష్యత్తు, జాగ్రత్తలపై వివరించారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి ప్రాజెక్టు సిడిపిఒ షాజిదాబేగం, యాడికి, పెద్దవడుగూరు, పామిడి, గుత్తి మండలాల తహశీల్దార్లు అలెగ్జాండర్, నాగభూషణ, ఎంపిడిఒలు లక్ష్మీనారాయణ, కుళాయిస్వామి, శశికళ, శివాజిరెడ్డి, ఎఇఒలు కాశప్ప, రాముడు, జయరాం, పామిడి సీఐ రాజశేఖరరెడ్డి, ఎపిఎం ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న స్త్రీశిశు సంక్షేమ శాఖ పీడీ శ్రీదేవి










