Aug 15,2023 21:14

చెత్త ఏరుకుంటున్న చిన్నారులు

బాల్యం.. బడికి దూరం..
- అధికమైన బడి బయట చిన్నారులు
- కానరాని ప్రయోజనం
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి

    బాల్యం బడికి దూరమవు తోంది. ఎంతోమంది చిన్నారులు చదువుకు దూరంగా ఉంటున్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వారిని పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్‌ విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై పలు మార్లు జిల్లా కలెక్టర్లు సమీక్షలూ నిర్వహించారు. అయినా ప్రయోజనం కానరావడం లేదు...
ఇప్పటి వరకు నంద్యాల జిల్లాలో 596 మంది పిల్లలు బడికి దూరంగా ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని వాలంటీర్ల ద్వారా వారిని గుర్తించారు. వీరి ఇంటి సమీపంలోని బడుల్లో చేర్చాలని ప్రభుత్వం నుంచి జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు అందాయి. అయినా ప్రయోజనం కనిపించడం లేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటం ప్రధాన కారణమైతే, తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడం మరో కారణమని సర్వేలో వెల్లడైంది. దీంతోపాటు సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చిన్నారుల చదువుపై ప్రభావం చూపుతున్నాయని విద్యావేత్తలు పేర్కొంటు న్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడంతో పాటు చదువుకోవడం వల్ల కలిగే లాభాలను శివారు ప్రాంతాలు, పేద కుటుంబాలు నివాసముంటున్న ప్రదేశాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాల్సి ఉందని అధికారులు సూచనలు ఇచ్చినట్లు సమాచారం. నంద్యాల జిల్లాలో 5వ తరగతి పూర్తి చేసుకొని 6వ తరగతిలో చేరకుండా సుమారు 985 మంది దూరంగా ఉన్నట్లు సమాచారం. నంద్యాల జిల్లా వెలుగోడులో 6, శ్రీశైలం 5, ఉయ్యాలవాడ 3, ప్యాపిలి 4, మిడుతూరు 3, చాగలమర్రి, గడివేముల, గోస్పాడు, కోవెల కుంట్ల, పగిడ్యాల, పాములపాడు, శిరివెళ్ల మండలాల్లో ఒక్కొక్కరు బడికి దూరంగా ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు.