పరిగి:మండలంలోని ప్రతి కుటుంబం బాల్య వివాహాల నిర్మూలణపై అవగాహన కలిగి ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డా. నవీన, డా. స్వరూప రెడ్డి సూచించారు. ప్రతి నెలా మొదటి మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించే 'ఆశా డే'లో భాగంగా పరిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ అబ్బాయికి 21, అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తరువాతే వివాహం చేసేలా ప్రతి తల్లి తండ్రికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఆశా కార్యకర్తలపై ఉందన్నారు. అమ్మాయిలకు 18 ఏళ్ల లోపే వివాహం చేయటం వల్ల కుటుంబం పట్ల అవగాహనా రాహిత్యం, గర్భాశయం సక్రమంగా ఎదుగుదల లేకపోవుట, అబార్షన్లు జరుగుట, రక్తహీనత, గర్భస్థ పిండం ఎదుగుదల సరిగాలేకపోవుట, మానసిక పరిపక్వత లోపం, తదితర అంశాల వల్ల కాన్పు సమంలో తల్లి పిల్లలకు ఇబ్బందులు ఎదురౌతాయన్నారు. ఆరోగ్య కార్యకర్తలకు, ఎంఎల్‌హెచ్‌పిలకు అన్ని ఆరోగ్య కార్యక్రమాల్లో సహకారం అందంచాలని సూచించారు. కాన్పు సమయంలో తప్పక వెంట వుండి కాన్పు చేయించాలని సూచించారు. అనంతరం ప్రతి బాలింతకు అవసరమైన సేవలు, పిల్లలకు టీకాలు అందేలా చూడాలన్నారు. ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎంఎల్‌హెచ్‌పిలదే అని హెచ్చరించారు. త్వరలో ఊటుకూరులో ప్రారంభం కానున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నియామకమైన వైద్యాధికారులు డా.సురేష్ కుమార్, డాక్టర్.రూబీ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాల సక్రమ నిర్వహణకు అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో సిహెచ్‌ఓ వన్నప్ప, పర్యవేక్షకులు వరలక్ష్మి, పార్వతి, రవీంద్ర, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు, ఎంఎల్‌హెచ్‌పిలు పాల్గొన్నారు.










