ప్రజాశక్తి-యర్రగొండపాలెం : బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 జీవోఎంఎస్ 31 ప్రకారం బాల్య వివాహాలను అరికట్టాలని ఎంపిడిఒ నాగేశ్వర ప్రసాద్ తెలిపారు. స్థానిక మండల పరిషత్ సమావేశపు హాలులో బాల్య వివాహా రహిత భారతదేశంపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ మాట్లాడుతూ బాల్య వివాహాలపై ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వివాహం నిశ్చయించుకొనే సమయంలో వాళ్ల ఇంటి దగ్గరికి వెళ్లి జనన ధ్రువీకరణ పత్రం తీసుకొని వివాహానికి సరిపడు వయసు ఉందో లేదో చూడాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద, పాఠశాలల వద్ద బాల్య వివాహాల సంబంధించిన పోస్టర్లను అంటించాలన్నారు. సిడిపిఒ పద్మావతి మాట్లాడుతూ ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నాయని ఫిర్యాదు వస్తే వెంటనే స్పందించాలన్నారు. విఆర్‌ఒ, సర్పంచి, మండల స్థాయి అధికారులకు సమాచారం తెలియజేసి అందరం సమిష్టిగా కృషి చేస్తేనే బాల్య వివాహాలను అరికట్టవచ్చని తెలిపారు. ఎంఇఒ ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో ఓ పోస్ట్ బాక్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. సమస్యలను నేరుగా చెప్పడానికి కొంతమంది విద్యార్థినులు సంకోచిస్తారని లెటర్ ద్వారా అయితే వారికి జరుగుతున్న సమస్యను క్లుప్తంగా రాసి పోస్ట్ బాక్స్ వేస్తారని తెలిపారు. అప్పుడు వారి సమస్యను పరిష్కరించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీ సర్వే డిప్యూటీ తహశీల్దారు రామకృష్ణ, సర్పంచి రామావత్ అరుణాబాయి, ఎపిఒ మూల వెంకిరెడ్డి, అంగన్‌వాడీ సూపర్ వైజర్లు సుబ్బమ్మ, పద్మజ, హైమావతి, అంగన్‌వాడీలు, ఎఎన్‌ఎంలు, హెల్త్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గిద్దలూరు : పట్టణ పేదరిక నిర్ములనా సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మెప్మా సిటీ మిషన్ మేనేజర్ అందుగుల ప్రసాద్ ఆధ్వర్యంలో రిసోర్స్ పర్సన్లు పట్టణంలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య రిసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు.










