అనంతపురం ప్రతినిధి : బాగేపల్లి సిపిఎం అభిమాన ప్రవాహంతో నిండిపోయింది. వేలాది మంది చేయిచేయి కలిపి సిపిఎం అభ్యర్థి నామినేషన్‌కు తరలొచ్చారు. విద్యార్థుల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపారు. నామినేషన్ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీ, బహిరంగ సభతో బాగేపల్లి వీధులు ఎరుపెక్కాయి. సిపిఎం మద్దతు దారులు, అభిమానుల నడుమ అట్టహాసంగా సిపిఎం అభ్యర్థి డాక్టర్ అనిల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. శనివారం ఉదయం బాగేపల్లి పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు.
సిపిఎం అభ్యర్థి డాక్టర్ అనిల్‌కుమార్ నామినేషన్ సందర్భంగా బాగేపల్లి పట్టణంలో నేషనల్ కాలేజీ నుంచి కెబిహెచ్ గ్రౌండ్స్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనకు నియోజకవర్గం పరిధిలోని అనేక గ్రామాల నుంచి పిల్లలు, 80 ఏళ్ల ముసలి వాళ్ల వరకు ఎర్రజెండాలను చేతపట్టుకుని కదం తొక్కారు. సిపిఎంకు జై... అనిల్ కుమార్‌ను గెలిపించుకుందామంటూ నినాదాలు చేస్తూ సాగిన ప్రదర్శనతో బాగేపల్లి పట్టణం ఎరుపెక్కింది. అనంతరం సిపిఎం చిక్‌బళ్లాపూర్ జిల్లా కార్యదర్శి మునివెంకటప్ప అధ్యక్షతన జరిగిన బహిరంగ సభకు సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో జెడిఎస్ రాష్ట్ర నాయకులు రామకృష్ణారెడ్డి, మహమ్మద్ నూరుల్లా సభలో పాల్గొని మద్దతునిచ్చారు. సభ ప్రారంభానాకి ముందు మాజీ ఎమ్మెల్యే జివి.శ్రీరామిరెడ్డి వర్ధంతిని పురష్కరించుకుని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో కర్నాటకలో సిపిఎం గెలుపు ఎంతో ముఖ్యమని చెప్పారు. గెలిచేది ఒక్కరే అయినా ప్రజల తరుపున గొంతును అసెంబ్లీలో వినిపించే వ్యక్తి అనిల్ కుమార్ ఒక్కరే అవుతారని పేర్కొన్నారు. ఏ పార్టీల నుంచి ఎంత మంది నేతలున్నా ప్రజా సమస్యలను పట్టించుకోరని తెలిపారు. కోవిడ్ సమయంలోనూ ఈప్రాంతంలో ప్రజల కోసం అనిల్ కుమార్ ఏ రకంగా పనిచేసారో అందరూ చూసుంటారని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోందన్నారు. బిజెపి రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ రాజాకీయ అంగాలుగా మార్చేస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే బిజెపిని ఓడించక తప్పదని పిలుపునిచ్చారు. అభ్యర్థి డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడేది సిపిఎం మాత్రమేనని చెప్పారు. సిపిఎంకు అవసరమైన బలాన్ని ఈ ఎన్నికల్లో ఇవ్వాలని కోరారు. ఇతర పార్టీల అభ్యర్థులు బిజెపి, కాంగ్రెసు నాయకులు ఎన్నికల్లో ప్రలోభ పెట్టడమే తప్ప ఆ తరువాత సమస్యలను పట్టించుకోరని విమర్శించారు. స్థానికంగా ఉండేది తాను ఒక్కడినే అని తెలిపారు. నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయని చెప్పారు. ఆ సమస్యలపై సిపిఎం ఇది వరకే సర్వే నిర్వహించి గుర్తించిందన్నారు. విద్యపరంగా ఎంతో వెనుకబాటుతనం ఉందన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వరలక్ష్మి మాట్లాడుతూ బిజెపి పాలనలో మహిళలు, మైనార్టీలపైనా దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం 40 శాతం కమీషన్ ప్రభుత్వంగా అందరూ పిలుచుకునే పరిస్థితి వచ్చిందన్నారు. అవినీతిమయంగా ఈ ప్రభుత్వం మారిందని విమర్శించారు. స్థానికంగా అందుబాటులో ఉండే అనిల్ కుమార్‌కు మద్దతునివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఉమేష్, కర్ణాటక కార్యదర్శి బసవరాజు, కార్యదర్శివర్గ సభ్యులు ప్రకాశ్, చిక్ బళ్లాపుర్ కార్యదర్శి మునివెంకటప్ప, తాలుకా కార్యదర్శి రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.










