ప్రజాశక్తి - ఆదోని
352 సర్వే నెంబరులో భూములపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరిపించి, కబ్జాకు గురైన బాధితులకు న్యాయం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.అజరు బాబు కోరారు. మంగళవారం సిపిఐ బృందం భూములను పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొన్ని సంవత్సరాలుగా సాదాపురం గ్రామ పంచాయతీలోని 352 సర్వే నెంబరు గల కొంత భూమి వివాదాస్పద వ్యక్తుల మధ్య తరచు వార్తల్లోనూ, సోషల్ మీడియా ద్వారా కబ్జాలకు గురఅవుతున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. పాలకులు, ప్రభుత్వ అధికారుల వైఫల్యంతో నిజమైన లబ్ధిదారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఒకే ప్లాటును ఇద్దరు, ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల నష్టపోయిన లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో మధ్యవర్తులను ఆశ్రయిస్తే న్యాయం చేయాల్సిందిపోయి సెటిల్‌మెంట్ చేయడం భావ్యం కాదన్నారు. డబుల్ రిజిస్ట్రేషన్ చేయించిన వారిపై చర్యలు తీసుకొని ఈ భూ వివాదానికి కారణమైన 352 సర్వే నెంబరుపై విచారణ జరిపించాలని కోరారు. లేకపోతే లబ్ధిదారులను సమీకరించి పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా అధ్యక్షులు కె.లక్ష్మారెడ్డి, సిపిఐ పట్టణ, మండల కార్యదర్శులు సుదర్శన్, కల్లుబావి రాజు, ఎఐటియుసి పట్టణ కార్యదర్శి బి.ఎంకన్న, జిల్లా సహాయ కార్యదర్శి ఒబి.నాగరాజు పాల్గొన్నారు.
స్థలాన్ని పరిశీలిస్తున్న నాయకులు










