May 19,2023 22:03

బాధితురాలితో మాట్లాడుతున్న ఎస్టీ కమిషన్‌ సభ్యులు

ప్రజాశక్తి అమడుగూరు: కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో గిరిజన మహిళపై అసభ్యంగా ప్రవర్తించి కులం పేరుతో దూషించిన ఎస్‌ఐ హేమంత్‌ కుమార్‌ పై బాధిత గిరిజన కుటుంబ సభ్యులు ఎస్టీ కమిషన్‌ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్టీ కమిషన్‌ సభ్యులు వడిత్య శంకర్‌ నాయక్‌ తదితరులు శుక్రవారం బాధిత రాధాబాయి కుటుంబాన్ని పరామర్శించి విచారణ చేపట్టారు . ముదిగుబ్బ ఎస్‌ఐ హేమంత్‌ కుమార్‌ ఓ కేసులో విచారించేందుకు రాత్రి సమయంలో రాధాబాయి ఇంట్లోకి ప్రవేశించి రాధాబారు తో పాటు ఆమె కూతురు మనిషాను కులం పేరుతో దూషించి మనిషా పట్ల అసభ్యంగా ప్రవర్తించారని బాధితులు కమిషన్‌ సభ్యులకు వివరించారు. టిడిపి కార్యకర్త కలాం, ఎస్‌ఐ హేమంత్‌ కుమార్‌, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు తమ ఇంటికి వచ్చి తమపై దౌర్జన్యం చేసి కులం పేరుతో దూషించి అసభ్యంగా ప్రవర్తించారని ఎస్టీ కమిషన్‌ ఎదుట రాధాబారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌ఐ హేమంత్‌ కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని అన్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేయాలని అక్కడే ఉన్న కదిరి డీఎస్పీ శ్రీలతకు కమిషన్‌ సభ్యులు సూచించారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని ఎస్టీ కమిషన్‌ సభ్యులు వడిత్య శంకర్‌ నాయక్‌ హామీ ఇచ్చారు.