ప్రజాశక్తి - ఆదోని
బాబుకు అండగా 'మేము సైతమ'ంటూ ఆదోనిలో తెలుగు మహిళలు కదం తొక్కారు. మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దొడ్డనకేరి సర్పంచి పార్వతమ్మ, విజయలక్ష్మి, రమీజా, అంజుగాంది, రాజేశ్వరి, నూర్జహాన్, ఉమామహేశ్వరి, స్వప్న, శ్రీదేవి, అయ్యమ్మలు దీక్షల్లో కూర్చున్నారు. అంతకుముందు ఆదోని నియోజకవర్గ మహిళలు పెద్దఎత్తున పాల్గొని ఎన్‌టిఆర్ విగ్రహం నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు 200 అడుగుల నల్ల జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, అబ్జర్వర్ గాజుల ఆదెన్న మాట్లాడుతూ... రానున్న రోజుల్లో టిడిపి అధికారంలోకి వస్తుందనే భయంతోనే కక్షతో అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, స్వయం సహాయక సంఘాలతో ఆర్థిక ఎదుగుదలకు కృషి చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. ఇతర దేశాల్లో సైతం బాబుకు అండగా రోడ్డెక్కినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మహిళలు ధనలక్ష్మి, నీరజ, సర్యమ్మ, శాంతి, ఈరమ్మ, జ్యోతమ్మ మద్దతు తెలిపారు. నాయకులు రామస్వామి, బుద్ధారెడ్డి, తిమ్మప్ప, వెంకటేష్, రంగస్వామి నాయుడు, మల్లికార్జున, వీరేష్ ఉన్నారు.
దీక్షనుద్దేశించి మాట్లాడుతున్న ఉమాపతి నాయుడు










