ప్రజాశక్తి - ఆదోని
టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కోసం రక్తం చిందిస్తామని మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ మీనాక్షి నాయుడు తెలిపారు. బాబు అరెస్టును నిరసిస్తూ గురువారం ఆదోనిలోని ఎన్‌టిఆర్ విగ్రహం వద్ద మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో 9వ రోజూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నియోజకవర్గ కురువ సోదరులు రిలే నిరాహార దీక్షల్లో కూర్చున్నారు. 'బాబు కోసం మేము సైతమ'ంటూ తెలుగు యువత రాష్ట్ర నాయకులు బసాపురం వెంకటేష్ రక్తంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు 'బాబుతో నేను' అని పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. ప్రజలు పెద్దఎత్తున పాల్గొని 500 పోస్టు కార్డులు పోస్టు చేశారు. గురవయ్య స్వాములు పెద్ద ఎత్తున తరలివచ్చి వారి ఆటపాటతో మద్దతు తెలిపారు. టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి భూపాల్ చౌదరి, డాక్టర్ సురేంద్రబాబు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి దీక్ష కూర్చున్న వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మీనాక్షి నాయుడు మాట్లాడారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎన్ని పీటీ వారెంట్లు ఇచ్చినా చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికి వస్తారన్నారు. కోర్టులో జరిగిన వాదోపవాదాలను ప్రపంచం మొత్తం చూస్తోందని, చంద్రబాబు రిమాండ్ ఎంత అక్రమమో ప్రజలు తెలుసుకుంటున్నారని అన్నారు. తప్పుడు పనులు చేసిన వారు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారన్నారు. బత్తిని కుబేర్ నాథ్, కొలిమి వెంకటేష్, వెంకన్నపేట మల్లికార్జున, నాగలాపురం లింగన్న, మధిర ఎల్లప్ప, దిబ్బనకల్ లక్ష్మన్న, నాగనాథనహళ్లి నరసప్ప, సంతేకుడ్లూరు శేషప్ప, హానవాలు సిద్ధ లింగ, శాంత కుమార్ దీక్షల్లో కూర్చున్నారు. నాయకులు నలగదొడ్డి లోక్‌నాథ్, తిరుపాల్, కురువ ఎల్లప్ప, నాగప్ప, రామస్వామి, మాబాష, మల్లికార్జున, రంగస్వామి నాయుడు, బుద్ధారెడ్డి, బాలాజీ, విరుపాక్షి, సదుల్లా, రామాంజి, బడే సాబ్, బిచ్ అంజనప్ప, నరసింహులు, తిమ్మప్ప, లక్ష్మీనారాయణ, బసవరాజు, ఉరుకుందు మద్దతు తెలిపారు.
దీక్షల్లో ముస్లిం మహిళలు
టిడిపి సీనియర్ నాయకులు సూరం భాస్కర్ రెడ్డి, మాన్వి దేవేంద్రప్ప, సౌదీ రావుఫ్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష శిబిరం 9వ రోజుకు చేరింది. దీక్షలో ముస్లిం మహిళలు కూర్చుని సంఘీభావం తెలిపారు. మాజీ కౌన్సిలర్ రామచంద్ర, షేక్షావలీ, కారుమంచప్ప, ఫక్కీరప్ప ఉన్నారు.
పోస్టు కార్డు ఉద్యమం ప్రారంభిస్తున్న మీనాక్షి నాయుడు










