Oct 31,2023 22:54

'బాబు' బెయిల్‌ సంతోషం : పురంధేశ్వరి

'బాబు' బెయిల్‌ సంతోషం : పురంధేశ్వరి
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మధ్యంతర బెయిల్‌ రావడం సంతోషమని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతి విమానాశ్రయానికి రాత్రి 7 గంటలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బాబు కేసు విషయాన్ని తప్పు బట్టడం లేదని, అరెస్టు చేసిన విధానాన్ని మొదటినుంచి ఖండిస్తూనే ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాల పర్యటనలో భాగంగా తొలుత శ్రీవారి చెంత తన పర్యటనను ప్రారంభించుకునేందుకు తిరుపతికి వచ్చినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తిరుపతి జిల్లాకు పెద్దపీట వేసిందని, అనేక కేంద్రీయ విద్యాసంస్థలను ఇక్కడ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. రూ.1800 కోట్లతో ఈ జిల్లాలో జాతీయ రహదారులను చేపట్టిందని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఏమాత్రం లేదన్నారు. తాము ఇచ్చిన కేంద్ర నిధులతో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్లను ఒక్కటి కూడా చేపట్టలేదన్నారు. ఆమెతో పాటు బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్‌ ఉన్నారు.