ప్రజాశక్తి - నందవరం
టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక మండలంలోని ముగతి గ్రామానికి చెందిన మసిపోగు నాగరాజు (42) శనివారం మృతి చెందారు. చంద్రబాబును అరెస్టు చేసిన నాటి నుంచి మనస్తాపంతో ఉండేవారని, ఏమైందో ఏమో ఛాతిలో నొప్పి ఉందని చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చామని కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీవీ.జయనాగేశ్వర రెడ్డి, మాజీ జడ్‌పిటిసి ముగతి ఈరన్న గౌడ్‌లు నాగరాజు మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుడు కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా బీవీ మాట్లాడారు. చంద్రబాబు అరెస్టుతో చాలామంది కార్యకర్తలు మృతి చెందడం బాధాకరమని, మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు ఓదార్పునిస్తూ అండగా ఉంటామని తెలిపారు. టిడిపి నాయకులు కాసీం వలీ, చిన్న రాముడు, గోపాల్, దావీదు, భార్గవ్ యాదవ్, కొండారెడ్డి, గిర్ని అంజినయ్య పాల్గొన్నారు. అలాగే కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి తరఫున నాయకులు ముగతి వీరారెడ్డి, కదిరికోట ఆదెన్న, వక్ఫ్ బోర్డు జిల్లా మాజీ డైరెక్టర్ జి.అల్తాఫ్, రాష్ట్ర ఉప్పర (సగర) ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ ఉప్పర ఆంజనేయులు, టిడిపి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ కురువ సాధికార కమిటీ సభ్యులు అడ్వకేట్ కెటి.మల్లికార్జున, ఆత్మ మండల మాజీ ఛైర్మన్ కందనాతి శ్రీనివాసులు, మైనార్టీ నాయకులు ఆఫ్గాన్ వలీ బాషలు పాల్గొన్నారు.
నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే బీవీ










