న్యూఢిల్లీ : అల్లోపతికి వ్యతిరేకంగా అశాస్త్రీయ ప్రకటనలు చేసి, శాస్త్రీయ వైద్యాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన బాబా రామ్‌దేవ్‌పై చర్యలు తీసుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అంటువ్యాధుల చట్టం కింద ఆయన్ను ప్రాసిక్యూట్ చేయాలని పేర్కొంది. రామ్‌దేవ్ ప్రకటనలు దేశంలోని అక్షరాస్యత సమాజానికి, ఆయనను నమ్మే పేద ప్రజలకు ముప్పు అని ఐఎంఎ తెలిపింది. 'అల్లోపతి అనేది ఒక స్టుపిడ్ (తెలివితక్కువ), దివాలా కోరు శాస్త్రం' అని రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అల్లోపతి వైద్యం చేయించుకున్న తర్వాత లక్షలాదిమంది మరణించారంటూ రామ్‌దేవ్ అందులో అవాకులు చవాకులు పేలారు. భారత ఔషధ నియంత్రణ మండలి (డిసిజిఐ) ఆమోదం పొందిన రెమిడెసివిర్, ఫావిఫ్లూ, ఇతర ఔషధాలు కరోనా రోగుల జబ్బు నయం చేయడంలో విఫలమయ్యాయంటూ ఆయన దాడి చేశారు.
కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రామ్‌దేవ్ బాబా ప్రజలను మరింత భయాందోళనలకు, నిస్పృహకు గురిచేసేలా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఐఎంఎ విమర్శించింది. ఈ విధమైన చౌకబారు ఎత్తుగడలతో రామ్ దేవ్ బాబా తన ఔషధ వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవాలని చూస్తున్నారని పేర్కొంది. అల్లోపతి వైద్యులను ప్రజలు సంప్రదించకుండా.. వారి ప్రాణాలను బాబా ప్రమాదంలోకి నెడుతున్నారని విమర్శించింది. అల్లోపతి వైద్యుడు కూడా అయిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ రామ్‌దేవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. లేకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా వాస్తవాలను ప్రజలకు వివరించడంతోపాటు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తానని ఐఎంఎ తెలిపింది.
హరిద్వార్‌లోని పతంజలి యోగ్‌ప్రీత్ ట్రస్టు బాబా రాందేవ్ అలా అనలేదని బుకాయించే ప్రయత్నం చేసింది. తనకు వచ్చిన ఒక ఫార్వార్డ్ సందేశాన్ని రామ్‌దేవ్ బాబా చదివారని చెప్పింది.










