Oct 25,2023 20:48

నిజం గెలవాలి సభలో ప్రసంగిస్తున్న నారా భువనేశ్వరి

'ఆయన'కు ప్రజలే ప్రాణం

నిజం గెలవాలి' సభలో నారా భువనేశ్వరి
నారావారిపల్లి నుంచి బస్సుయాత్ర ప్రారంభం
మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం


ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
'ఆయనకు ప్రజలంటే ప్రాణం.. పార్టీ కార్యకర్తలన్నా, నాయకులన్నా సొంత బిడ్డల్లా చూసుకుంటారు.. ప్రజలు, పార్టీ తరువాతనే కుటుంబం..' అని నారా భువనేశ్వరి అన్నారు. 'రాష్ట్ర ప్రభుత్వ అరాచక పాలనతో నిజం ఈ రోజు గెలవకపోవచ్చు.. ఎప్పటికైనా నిజం అనేది గెలిచి తీరుతుంది.. చేయి చేయి కలిపి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన తరుణం ఆసన్నమయ్యింది.. ప్రతి ఒక్క టిడిపి కార్యకర్తా కంకణబద్దులై నిజాన్ని గెలిపించే పనిలో ఉండాలి..' అని నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి భావోద్వేగ ప్రసంగం చేశారు. 'నిజం గెలవాలి' బస్సు యాత్ర చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లిలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ప్రారంభమయ్యింది. అంతకుముందు ఉదయం 11 గంటలకు చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక భావోద్వేగానికి గురై గుండెపోటుతో మృతిచెందిన పాకాల మండలం నేండ్రగుంటకు చెందిన కనుమూరి చిన్నబ్బనాయుడు, చంద్రగిరిలో ప్రవీణ్‌రెడ్డి కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి స్వయంగా వెళ్లి ఓదార్చారు. ఎన్టీఆర్‌ ట్రస్టు తరపున ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. అగరాల వద్ద జరిగిన 'నిజం గెలవాలి' బహిరంగసభకు మహిళలు పెద్దఎత్తున కదం తొక్కారు. 'రెండు రోజుల క్రితం నారావారిపల్లికి వచ్చాను.. ఎపుడూ కుటుంబమంతా వచ్చి ఎంతో సంతోషంగా గడిపేవాళ్లం.. ఈసారి ఒక్కదాన్నే వచ్చాను.. గతంలో ఆనంద క్షణాలు గుర్తుకొచ్చి చాలా బాధగా ఉంది' అని భావోద్వేగంతో కంట తడిపెట్టడంతో సభలో మహిళలు సైతం కన్నీరుమున్నీరవడం కనిపించింది. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ప్రజల కోసమే ఆలోచించారు తప్ప, కుటుంబానికి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేవారు కాదన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా తన భర్తను రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో నిర్బంధించారని, త్వరలోనే కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారని, అప్పటివరకూ టిడిపి శ్రేణులంతా తనకు అండగా నిలవాలని కోరారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి కూతురిగా, ఓ ముఖ్యమంత్రి భార్యగా ఎపుడూ బయటకు రాని భువనేశ్వరమ్మ ఈరోజు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు మీ ముందుకు వచ్చారన్నారు. ప్రతి తెలుగు మహిళా, ప్రతి టిడిపి అభిమాని ఆమెకు వెన్నుదన్నుగా ఉండాలన్నారు. మాజీ స్పీకర్‌ ప్రతిభాభారతి మాట్లాడుతూ '2024లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అను నేను' ప్రమాణం చేస్తున్నా అని చెప్పేంత వరకూ టిడిపి శ్రేణులన్నీ ఒక్కటవ్వాలన్నారు. మాజీ మంత్రి అమరనాధరెడ్డి మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్న ఐదేళ్లు చిత్తూరు జిల్లాలో వైసిపి కార్యకర్తలపై ఓ కన్సేసి ఉంటే ఈరోజు జగన్‌ ప్రభుత్వం ఉండేదా? అని ప్రశ్నించారు. అదే చంద్రబాబుకు, జగన్‌కు తేడా అన్నారు. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి చూడాలంటారని, జగన్‌ రాష్ట్రం నాశనం కావాలని కోరుకుంటున్నారన్నారు. త్వరలోనే ప్రజలందరూ ప్రజాక్షేత్రంలో న్యాయాన్ని గెలిపించాలన్నారు. ఈ టిడిపి అధికార ప్రతినిధి నల్లారి నరేష్‌కుమార్‌రెడ్డి, ఎంఎల్‌సిలు దొరబాబు, కంచర్ల శ్రీకాంత్‌, చంద్రగిరి టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పులివర్తినాని, పులివర్తి సుధారెడ్డి, తిరుపతి మాజీ ఎంఎల్‌ఎ సుగుణమ్మ, శ్రీకాళహస్తి నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. 'నిజం గెలవాలి' అనే బ్యాక్‌డ్రాప్‌ బ్యానర్‌లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఫొటో కనిపించింది. అయితే జనసేన శ్రేణులు ఎవరూ సభకు హాజరుకాకపోవడం గమనార్హం. అనంతరం 'నిజం గెలవాలి' బస్సు యాత్ర తిరుపతి నియోజకవర్గంలో అడుగు పెట్టింది. తిరుపతిలో గురువారం జ రగనున్న నిజం గెలవాలి సభను జయప్రదం చేయాలని మాజీ ఎంఎల్‌ఎ సుగుణమ్మ విజ్ఞప్తి చేశారు.
నిజం గెలవాలి సభలో ప్రసంగిస్తున్న నారా భువనేశ్వరి