అనంతపురం ప్రతినిధి : ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఆయకట్టు రైతులను అయోమయంలోకి పడేస్తున్నాయి. ప్రధాన ప్రాజెక్టుల్లోనూ నీరు ఆశించినంత లేదు. మరోవైపు జిల్లా ప్రాజెక్టుల్లో నీరు పూర్తిగా అడుగంటుతోంది. దీంతో ఆయకట్టుపై ఆధారపడి పంటలు సాగు చేసుకోవాలో లేదోనన్న మీమాంశ రైతాంగంలో నెలకొంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రైతులు సాగుకు సమయత్తమై ఉన్నారు. ఎప్పటిలాగానే నీరొస్తుందని భావించి పంట సాగు చేస్తే కీలక సమయంలో నీరు రాకపోతే పరిస్థితి ఏమిటన్న గుబులు రైతుల్లో నెలకొంది. ఇప్పటికే తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ కింద ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. ఎప్పటిలాగానే నీరొస్తుందని తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ కింద కణేకల్, బొమ్మనహళ్ మండలాల్లో వరి నార్లు పెట్టుకున్నారు. గత వారంలో కాలువకు గండిపడి నీరురాక కొన్నిచోట్ల నారుమడులు ఎండిపోయే దశకు చేరాయి. రెండు రోజులుగా నీరు పునరుద్ధరణ కావడంతో కాస్తఊరట లభించింది.
ప్రధాన ప్రాజెక్టుల్లో అడుగంటిన నీరు
జిల్లాకు సాగు,తాగునీటిని అందించే ప్రధాన ప్రాజెక్టులు రెండున్నాయి. అందులో మొదటి తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ కాగా, హంద్రీనీవా రెండోది. ఈ రెండు ప్రాజెక్టుల్లోనూ ప్రస్తుతానికి నీరుంది. అయితే పూర్తి స్థాయిలో 75.39 టిఎంసిలు ఉంది. ఇప్పటికే తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువకు నీటిని వదిలారు. కాని ప్రధాన కాలువకు కొన్నేళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో తరచూ గండ్లు పడుతున్నాయి. నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. సెప్టంబర్‌లో వర్షాలు రాకపోతే తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ ద్వారా నీరు పూర్తి స్థాయిలో తీసుకోవడంలోనూ సమస్య రానుంది. ఇక శ్రీశైలం డ్యామ్ నుంచి హంద్రీనీవా ద్వారా జిల్లాకు నీరొస్తుంది. శ్రీశైలం డ్యామ్‌లో ప్రస్తుతం 81.91 టిఎంసిల నీరు మాత్రమే ఉంది. వర్షాలు వచ్చే నెల కూడా రాకపోతే ఇబ్బంది తలెత్తనుంది. దీంతో హంద్రీనీవా కింద ఆయకట్టు లేనప్పటికీ కాలువ వెంట ఆయకట్టు సాగవుతోంది. నీరు ఈ కాలువలో రాకపోతే పంటలు ఎండిపోయే అవకాశమున్నందున సాగు చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.
ప్రాజెక్టుల్లో తగ్గిన నీరు
జిల్లాలోనున్న ప్రధాన ప్రాజెక్టుల్లో నీరు చూస్తే పూర్తిగా తగ్గిపోయింది. పిఎబిఆర్ డ్యామ్ నిలువ సామర్థ్యం 11.1 టిఎంసి అయితే 1.9 టిఎంసిలే నీరు నిలువ ఉంది. 5.2 టిఎంసిల నిలువ సామర్థ్యమున్న మిడ్‌పెన్నార్‌లో 1.08 టిఎంసిల నీరుంది. రెండు టిఎంసిల సామర్థ్యమున్న భైరవానితిప్పలో 0.85 టిఎంసిలు నీరుంది. ఇలా ముఖ్యమైన ప్రాజెక్టుల్లో నీరు చాలా తక్కువగానే ఉంది.
ఆయకట్టు పరిస్థితి ఏమిటీ ..?
జిల్లాలో 2.84 లక్షల రిజిష్టర్డు ఆయకట్టుంది. ఇది ప్రధానంగా తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ కిందనే ఉంది. ఇందులో ఏటా లక్ష ఎకరాల వరకు తడి, ఆరుతడి పంటలకు నీరిస్తారు. ప్రధానంగా బొమ్మనహళ్, కణేకల్, ఉరవకొండ, విడపనకల్లు మండలాలుంటాయి. హంద్రీనీవా కింద రిజిష్టర్డు లేకున్నా కాలువ వెంట ఉండే మండలాలు గుంతకల్లు, వజ్రకరూరు, ఉరవకొండ, బెళుగుప్ప మండలాలు ఉంటాయి. ఇక్కడ రైతులు వేల ఎకరాల్లోనే సాగు చేస్తారు. నీరు రాకపోతే ఈ రైతులకు ఇబ్బందులు తప్పవు.










