Oct 06,2023 09:03

తుంగభద్ర డ్యాం

            అనంతపురం ప్రతినిధి : అనుకున్నది ఒక్కటయితే... అయింది మరొకటి అన్నట్టుగా మారింది. జిల్లా సాగునీటి లభ్యత అంచనాలకు తప్పింది. తుంగభద్ర డ్యామ్‌కు అనుకున్నంత నీటి లభ్యత లేకపోవడంతో ముందు అనుకున్నంత నీరు జిల్లాకు వచ్చే పరిస్థితి లేదు. ఈ ప్రభావం ఆయకట్టుపై తీవ్రంగా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ముందు అంచనా ప్రకారం తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువకు 26.828 టిఎంసిల నీరు లభిస్తుందని అంచనా వేశారు. ప్రస్తుతమున్న పరిస్థితులను తుంగభద్ర బోర్డు అధికారులు గురువారం అంచనా వేశారు. తుంగభద్ర డ్యామ్‌లో జరిగిన సమావేశంలో తుంగభద్ర డ్యామ్‌ ఎస్‌ఇ శ్రీకాంత్‌రెడ్డి, తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ ఎస్‌ఇ రాజశేఖర్‌, లోకలేజేషన్‌ ఇఇ ఎంవి.రమణారెడ్డి, ఎల్‌ఎల్‌సి ఇఇ నీలకంఠారెడ్డి పాల్గొన్నారు. సెప్టంబరు మంచి వర్షాలొస్తే నీరు పుష్కలంగా వస్తుందని భావించారు. కాని ఆశించినంత వర్షాలు రాలేదు. దీంతో నీటి లభ్యత పూర్తిగా పడిపోయింది. ముందుగా వస్తుందని వేసుకున్న అంచనా ప్రకారం 26.828 టిఎంసిలకుగానూ 16.097 టిఎంసిలు మాత్రమే ఈ ఏడాది కేటాయింపులకు పరిమితం చేశారు. ఇందులో ఇప్పటికే 8.55 టిఎంసిలు జిల్లాకు చేరింది. మిగిలిన 7.547 టిఎంసిలు రావాల్సి ఉంది.
ఆయకట్టు ప్రశ్నార్థకం
 ముందు అంచనా ప్రకారం పది టిఎంసిలు సాగునీటికి, 16 టిఎంసిలు ఆయకట్టుకు అని సాగునీటి సలహామండలి సమావేశంలో తీర్మానించారు. మారిన అంచనాల ప్రకారం 16 టిఎంసిలే వస్తే ఇది తాగునీటికి కూడా సరిపోయే పరిస్థితి ఉండదు. ఎందుకంటే 16 టిఎంసిల్లో ప్రవాహ నష్టంపోనూ పది టిఎంసిల మిగులు మాత్రమే ఉంటుంది. ఈ పది టిఎంసిలు తాగునీటి అవసరాలకు వినియోగిస్తే, ఇక సాగునీరు పూర్తిగా ప్రశ్నార్థకం కానుంది. ముందు అంచనా ప్రకారమైతే 11 టిఎంసిలు సాగునీటికి కేటాయించి లక్ష ఎకరాలకు నీరివ్వాలన్నది అంచనా. కాని సాగునీటికి వచ్చే నీరు వాడితే తాగునీటి అవసరాలకు కొరత ఏర్పడనుంది. ప్రాధాన్యత క్రమంలో తాగునీటికి ప్రాధాన్యత ఇచ్చే అకాశమున్నందున ఆయకట్టు పూర్తిగా నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి.