ప్రజాశక్తి-పార్వతీపురం : చట్టాలపై అవగాహన అవసరమని రాష్ట్ర ఎస్టీ కమీషన్ ఛైర్మన్ డా. డి.వి.జి శంకర రావు అన్నారు. షెడ్యూలు తెగ (ఎస్టీ), షెడ్యూల్ జాతులు (ఎస్సీ) సాధికారిత, అత్యాచారాల నియంత్రణ అంశాలపై అవగాహన సదస్సు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) పౌర హక్కుల రక్షణ విభాగం ఆధ్వర్యంలో బుధవారం పార్వతీపురం ఐటిడిఎ గిరిమిత్ర సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమీషన్ ఛైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్టీ కమీషన్ ఛైర్మన్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు చట్టాలపై అవగాహన పొందాలన్నారు. భారత రాజ్యాంగం అందరికీ సమాన స్వేచ్చ, న్యాయం, సౌభ్రాృత్వాన్ని కల్పించిందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సమానత్వం అనుభవించాలని ఆయన స్పష్టం చేశారు. కొన్ని సందర్భాల్లో బలహీనులు బాధితులుగా మారతారని, వాటికి వ్యవస్థలు సహకరించి న్యాయం చేయాలని ఆయన అన్నారు. బాధితులు ముఖ్యంగా అట్టడుగు వర్గాల రక్షణకు అనేక చట్టాలు అమలులో ఉన్నాయని తెలిపారు. చట్టం అంటే శిక్షించేది కాదని బాధ్యతలను తెలియజేసేది, రక్షణగా నిలిచేది అని ఆయన వివరించారు. వాటిపై సమగ్ర అవగాహన అవసరమని ఇందుకు విద్య దోహదం చేస్తుందని ఆయన చెప్పారు. విద్యతో వివేకం పెరిగి సామాజిక జ్ఞానం పెంపొందుతుందని అన్నారు. ప్రతీ ఒక్కరు విద్యావంతులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం అనేక సదుపాయాలను కల్పిస్తుందని, పథకాలను అమలు చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సామాజిక అవగాహన, బాధ్యత పెంపొందించు కోవాలని అన్నారు. బాధితులకు అండగా ఎస్టీ కమీషన్ ఉంటుందని ఆయన తెలిపారు. సమస్యలను తెలియజేయ వచ్చని వాటిని పరిష్కరించుటకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ శాఖ అవగాహన కల్పించాలని మంచి కార్యక్రమాన్ని చేపట్టిందని అభినందించారు. వివిధ శాఖల అధికారులు తమ పరిధిలో చట్టాలు, నియమాలు, ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్నవారికి క్విజ్ ను నిర్వహించారు. ఇందులో విజేతలుగా నిలిచిన ఏ. షర్మిల దేవి, ఎం.రామలక్ష్మి, డి. సంగీత, జి. గౌరీశ్వరిలకు, చక్కని అవగాహన కల్పించిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ పక్కి లావణ్యకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) విశాఖ ప్రాంతీయ కార్యాలయం డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం.ఎన్.భూపాల్, సిఐడి డిఎస్పీ ఎల్.నాగేశ్వరి, లక్ష్మణ రావు, ఇన్స్పెక్టర్ లు జి.గోవింద రావు, బివిజి ప్రసాద్, ఎస్టీ, ఎస్సీ సెల్ డిఎస్పీ జి. మురళిధర్, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి కె. శ్రీనివాస రావు, ఎస్సీ ఎస్టీ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి. వెంకట నాయుడు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి జివి రమణ, సహాయ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి పి శశిభూషణ రావు, అఖిల భారత ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె. నాగేశ్వర రావు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు ఆరిక శాంతి కుమారి, తదితరులు పాల్గొన్నారు.










